తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కేసులో ఈ రోజు సుప్రీం కోర్టులో విచరణ జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందు ఈ పిటీషన్ రాగా, జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదు అంటూ పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే ఇదే పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసినప్పుడు, హైకోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేసిన పిటీషన్ పైన, పిటీషన్ దారుడు సుప్రీం కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసులో విచారణ సందర్భంగా, ఈ రోజు జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదా అని ఆరా తీస్తూ, అలా ఒక వేళ జరగక పొతే, వెంకటేశ్వర స్వామి ఎవరినీ ఉపేక్షించరని, వెంకటేశ్వర స్వామి మహిమలు ఏమిటో అందరికీ తెలుసని, తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడునే అని, తనతో పాటు ఇతర జడ్జిలను చూపిస్తూ, వీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులే అని అన్నారు. స్వామి వారి సేవల్లో ఎటువంటి అన్యాయం జరగదని, ఒకవేళ జరిగితే మాత్రం, వాళ్ళు శిక్షార్హులు అవుతారని అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగటం లేదు అంటూ వచ్చిన పిటీషన్ పై జస్టిస్ ఎన్వీ రమణ, టిటిడిని కూడా వివరణ అడిగారు.
దీని పై కౌంటర్ దాఖలు చేయాలని టిటిడి ఆదేశిస్తూ, తరువాత దీని పైన విచారణ జరుపుతాం అంటూ, తదుపరి విచారణను వారం రోజులు పాటు వాయిదా వేసారు. వెంకటేశ్వర స్వామి పైన తనకున్న భక్తిని, ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ చాటి చెప్పారు. ఇక ఇదే కేసులో టిటిడికి సంబంధించిన మరో అంశం అయిన, హిందూయేతర భక్తుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని అనే కేసు పై కూడా జస్టిస్ ఎన్వీ రమణ తన మార్క్ చూపించారు. సుప్రీం కోర్టు చరిత్రలో మరోసారి తెలుగులో సంబాషణలు చేస్తూ, కేసులో వాదనలు విన్నారు. పిటీషనర్ తో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడారు. హిందూయేతర భక్తుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలనే ఆదేశాలు అమలు అయ్యేలా చూడాలి అంటూ పిటీషనర్ కోరారు. ఈ పిటీషన్ వేసింది శివారి దాదా. మొత్తానికి శ్రీవారి కేసు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలుగులో మాట్లాడటమే కాదు, వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు అని, ఆయన జోలికి వస్తే, ఆయన ఉపెక్షించరు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.