వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, ఇతరులు, మేము కులం చూడం, పార్టీ చూడం అంటూ ఊదరగొడుతూ హడావిడి చేస్తుంటే, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం, మా పార్టీని గెలిపించరా ? మీ సర్పంచ్ కు మేము సహకారం అందించాం అంటూ బహిరంగంగా చెప్పారు. అంతే కాదు, అక్కడ ఉన్న అధికారులకు కూడా వేలు పెట్టి మరీ, మీరు సహకరించవద్దు అంటూ, ఆదేశాలు జారీ చేసారు. నెల్లూరు జిల్లా పల్లెపాడు గ్రామ ప్రజలను ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ షాక్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే, "ఏమి తప్పు చేసామో చెప్పండి. ఇన్ని పనులు చేయటమే తప్పా ? అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదా, ఈ గ్రామ ప్రజలకి ? ఇంత కష్టపడి, ఇంత గొడ్డు చాకరీ చేసి, మీ మధ్య ఉంటూ, మీ మధ్య తిరుగుతూ, ఇన్ని పనులు చేస్తే, ఈ గ్రామం వాళ్ళు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధిని గెలిపించారు. చాలా బాధ వేస్తుంది. ఇంత కష్టపడి మీ మధ్య ఉండి, సచివాలయ సిబ్బంది, మా వాలంటీరులు, మా నాయకులు, కార్యక్తలు, గ్రామ స్థాయి అధికారులు మీ కోసం గొడ్డు చాకిరీ చేసాం, నిద్రాహారాలు మాని. జగన్ గారు ఇచ్చిన పధకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏమి తక్కువ చేసాం మీకు ? "
"మా అభ్యర్ధిని ఎందుకు ఓడించారు అని ఈ సమావేశం ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఇది కరెక్ట్ కాదు కదా. ఏమి చేయగలుగుతాడు, మీరు గెలిపించిన తెలుగుదేశం సర్పంచ్ ? మేము అయితే దగ్గరకు రానివ్వం. ఒక్క పని చేయం. గ్రామ కార్యదర్శికి కూడా చెప్తున్నా, అతనికి సహకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము చెప్పిందే జరగాలి. మేము ఏది ఆదేశిస్తే అదే జరగాలి. మరొక్కసారి అధికారులకు కూడా చెప్తున్నా, ఒక్క పని కూడా అవతల పార్టీ వాడికి చేసేది లేదు. ఎవరు చెప్పినా వినాల్సిన పని లేదు. ఈ గ్రామంలో ఏ పని చేయాలి అన్నా, మా పార్టీ నాయకులు చేయాల్సిందే. ఒక్కరిని కూడా మా పార్టీలో చేర్చుకోం. దగ్గరకు కూడా రానివ్వం. ఏమి అవసరం, మీరు మాకు ఎందుకు, మా అధికారులు, మా సచివాలయ సిబ్బంది, మా వాలంటీర్స్ ఉన్నారు. మీకు సహకరించాల్సిన అవసరం మాకు లేదు. " అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. గెలిచిన సర్పంచ్ ను కాదని, ఎలా ఉంటాం అంటూ మాట్లాడుకున్నారు.