ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్ళు క-రో-నా కారణంగా రాజకీయం పెద్దగ నడవలేదు. ఏదో ప్రతి రోజు జరుగుతున్న సంఘటనల పై రెండు వైపులా తిట్టుకోవటమే కానీ, ఎక్కడా పెద్దగా రాజకీయం నడిచింది లేదు. క-రో-నా తగ్గటంతో, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఆక్టివ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే, మరో చిన్న పార్టీ అయిన బీజేపీ కూడా తమకు తెలిసిన విద్య ప్రదర్శించటానికి రెడీ అవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో, ఇక్కడ బీజేపీకి పెద్దగా ఆదరణ లేకపోయినా, బీజేపీ అంటే వైసీపీ ఆచితూచి స్పందిస్తూ వస్తుంది. చంద్రబాబు ఏమైనా అంటే, వరుస పెట్టి ప్రెస్ మీట్ లు పెట్టే నేతలు, బీజేపీ నుంచి ఎంత పెద్ద విమర్శ వచ్చినా, ఏదో అంటీ ముట్టనట్టు ఉంటూ వస్తారు. దీనికి అనేక కారణాలు ఉన్నా, ముఖ్యంగా జగన్ పై ఉన్న కేసులు వల్లే ఇలా, కేంద్రంతో ఎక్కువగా పెట్టుకోరు అనేది, జగమెరిగిన సత్యం. ఈ మధ్య బీజేపీ నేతలు ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అక్కడ వారికి ఇక నుంచి ఏమి చేయాలో చెప్పారని సమాచారం. మరో పక్క జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు 25వ తేదీ రానుంది. ఇక అలాగే కేంద్రం అప్పుల మీద, రాష్ట్రం పీక పట్టుకుంది. వరుస పెట్టి ఉత్తరాలు రాస్తుంది. దీంతో వైసిపీకి హీట్ పెరిగింది.
ఈ రోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఇదే విషయం పై, చర్చ జరిగింది. జగన్ మోహన్ రెడ్డి మంత్రుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కొంత మంది మంత్రులు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల పై అసలు స్పందించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ వాళ్ళు విమర్శలు చేస్తుంటే, ఎందుకు వదిలేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇద్దరు బీజేపీ నేతలు, వారి విమర్శలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక నుంచి బీజేపీ నేతల మాటలకు కౌంటర్ ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా, ఈ రోజు పులిచింతల పై టిడిపి విమర్శలు చేస్తే, ఎందుకు కౌంటర్ ఇవ్వలేదని వాపోయారు. పధ్ధతి మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు. ముగ్గురు మంత్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని సమాచారం. దీంతో క్యాబినెట్ వివరాలు చెప్పిన పేర్ని నాని, బీజేపీ పై విమర్శలు చేసారు. బీజేపీ ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని పడగొట్టటానికి కుట్రలు చేస్తుంది అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. కాషాయం వ్యక్తిని సియం కుర్చీ ఎక్కించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.