జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి, విజయసాయి రెడ్డి పైన సిబిఐ విచారణ చేసి, విచారణ కొనసాగుతున్న సమయంలోనే, మనీ లాండరింగ్ ఆరోపణల నేపధ్యంలో, ఈడీ అధికారులు కూడా సమాంతరంగా విచారణ చేసి, వాటి పై చార్జ్ షీట్లు కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సిబిఐ కోర్టు, ఈడీ కోర్టులో కూడా విచారణ మొదలైంది. అయితే ముందుగా ఈడీ చార్జ్ షీట్లు ఫైల్ చేసారు కాబట్టి, ఈడీ కోర్టులో విచారణ మొదలు పెట్టాలని గతంలో ఈడీ కోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పై విజయసాయి రెడ్డి సిబిఐ కోర్టుకు వెళ్లి, రెండు విచారణలు అవసరం లేదని, సిబిఐ కోర్టులో కలిపి విచారణ చేయాలని కోరారు. అయితే సిబిఐ కోర్టు విజయసాయి రెడ్డి పిటీషన్ ని తోసిపోచ్చింది. దీంతో విజయసాయి రెడ్డి, ఈ తీర్పుని సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. విజయసాయి రెడ్డి జనవరి 11వ తేదీన హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుని కోరారు. ముందుగా సిబిఐ కేసులు విచారణ జరిపిన తరువాతే, ఈడీ కేసులు విచారణ జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ కూడా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన గత కొన్ని రోజులుగా, తెలంగాణా హైకోర్టులో విచారణ కొనసాగింది.
దీని పై హైకోర్టు ఈ రోజు తమ తీర్పుని ప్రకటించింది. విజయసాయి రెడ్డి వేసిన పిటీషన్ ను కొట్టి వేస్తూ, హైకోర్టు నిర్ణయం తీసుకుంది. సిబిఐ అధికారులు విచారణ చేసిన సమయంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల నేపధ్యంలో, ఒక వైపు ఈడీ అధికారులు కూడా విచారణ చేసి, ఆధారాలు దొరికిన తరువాతే చార్జ్ షీట్ దాఖలు చేసారు కాబట్టి, ఇప్పుడు ఈడీ కేసులు విచారణ ముందుగా జరిపితే, మీకు అభ్యంతరం ఏమిటి అంటూ కూడా విజయసాయి రెడ్డిని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే విజయసాయి రెడ్డి న్యాయవాది ప్రధానంగా నాలుగు అయుదు వాదనలు గట్టిగా వినిపించారు. ప్రధానంగా సిబిఐ కేసు విచారణ జరిపితే తాము నిర్దోషిగా బయటకు వస్తే, ఈడీ కేసులు నిలబడవు కాబట్టి, ముందుగా సిబిఐ కేసు విచారణ చేయమని కోరారు. అయితే సిబిఐ న్యాయవాది వదానలు వినిపిస్తూ, ఈడీ విచారణ పూర్తయ్యింది కాబట్టే ముందుగా ఈడీ చార్జ్ షీట్ చేసిందని, విజయసాయి రెడ్డి పిటీషన్ పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. దీంతో కోర్టు కూడా ఏకీభావించింది. దీంతో ఈడీ కోర్టులో కూడా విచారణ మొదలు కానుంది.