వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ సొంత పార్టీలోని నెంబర్ వన్ అయిన జగన్ మోహన్ రెడ్డి, నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు. తన తండ్రి అధికారంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు కూడబెట్టారు అంటూ, సిబిఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తరువాత జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి 16 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తరువాత, ఇద్దరికీ కండీషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ ఇచ్చే సమయంలో, బెయిల్ షరతులు ఉల్లంఘించం అంటూ, పూచికర్తు కూడా ఇద్దరూ ఇచ్చారు. ఆ తరువాతే ఇద్దరికీ బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే పాయింట్ పట్టుకున్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. ముందుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించారు అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్ వేసారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య, ఈ కేసులో వాదనలు ముగిసాయి. ఈ కేసుకు సంబంధించి, తీర్పు ఈ నెల 25న రానుంది. అయితే ఈ కేసు విషయంలో సిబిఐ వ్యవహార శైలి మాత్రం, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు రఘురామరాజు జగన్ వ్యవహారం కొలిక్కి రావటంతో, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసారు.
విజయసాయి రెడ్డి అన్ని కేసుల్లో ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల్లో ఈయన ముఖ్యమైన వ్యక్తి అని, ప్రస్తుతం ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఉన్నతాధికారులు, హోం శాఖ చుట్టూ తిరుగుతూ, సిబిఐ దర్యాప్తుని ప్రభావితం చేస్తున్నారని, అలాగే న్యాయస్థానాల పట్ల కూడా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, అందుకే అతని బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు, వారం రోజులు క్రితం సిబిఐ కోర్టులో పిటీషన్ వేసారు. అయితే ఈ పిటీషన్ సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, తీసుకోదా అని అందరూ ఆనుకున్న సమయంలో, ఈ రోజు సిబిఐ కోర్టు, విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ, రఘురామరాజు పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 10న దీని పై విచారణ జరుపుతాం అని చెప్పింది. దీంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి కౌంటర్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారో చూడాల్సి ఉంది. ఈ కేసులతో ఏమవుతుంది అనేది పక్కన పెడితే, జగన్, విజయసాయి రెడ్డికి మాత్రం, రఘురామరాజు చెవిలో జోరీగలా తయారుఅయ్యారు. మరి సిబిఐ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.