రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం సుప్రీం కోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను, రెండు రోజులు క్రిందట విచారణ జరిగిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందు ఈ పిటీషన్ వచ్చింది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో, ఈ పిటీషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో, శ్రీశైలం నుంచి తెలంగాణా నీటిని విద్యుత్ ఉత్పత్తు కోసం వాడుతూ, అనవసరంగా నీటిని కిందకు విడుదల చేసిందని, సాగు నీటికి ఉపయోగపడటం లేదని, కాబట్టి తెలంగాణా ప్రభుత్వాన్ని శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తీసుకోవటాన్ని నిలిపివేయాలి అంటూ, ఆ మేరకు తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలి అంటూ ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై, మొన్న సోమవారం విచారణకు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం ఇరు రాష్ట్రాలకు కూడా ఈ జల వివాదాలకు సంబంధించిన అంశాల పై మధ్య వర్తిత్వమే మంచిది, అంటూ రెండు రాష్ట్రాలకు సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవ పెట్టకుండా, ఈ న్యాయ పరమైన అంశాల జోలికి పోకుండా, మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ సమయంలో అస్సాం, మిజోరాంలో జరుగుతున్న విషయాల పై న్యాయవాది చెప్పగా, కలలో కూడా అలా జరగాలని కోరుకోవద్దు, ఇరు రాష్ట్రాలు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ, మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలి అంటే తాను ముందు ఉంటాను అంటూ చెప్పారు. దీంతో ఏపి ప్రభుత్వం హజారైన దుష్యంత్ దవే మీరు చాలా చక్కని మాట చెప్పారు, ఈ విషయం ఏపి ప్రభుత్వాన్ని అడిగి చెప్తానని చెప్పారు. అయితే ఏపి ప్రభుత్వం తరుపున ఈ రోజు హాజరైన మరో న్యాయావాడి ఉమాపతి, ఈ కేసుని మేము న్యాయ పరంగానే ఎదుర్కుంటాం అని, మధ్యవర్తిత్వం అవసరం లేదని, కోర్టుకు చెప్పారు. దీంతో ఏపి ప్రభుత్వం వద్దు అని చెప్పటంతో, ఈ కేసుని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. అయితే కేంద్రం తరపు హాజరైన న్యాయవాది మాత్రం, మీరే ఈ కేసు చూడాలని చెప్పగా, అందుకు చీఫ్ జస్టిస్ ఒప్పుకోలేదు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని అందుకే వేరే బెంచ్ కు బదిలీ చేస్తున్నామని చెప్పారు.