దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య గానే కాకుండా, జగన్ పార్టీ పెట్టిన తరువాత, జగన్ కు అండగా చేసిన యాత్రలు కూడా వైఎస్ విజయమ్మ అంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ఈ మధ్య కాలంలో వైఎస్ విజయమ్మ, జగన్ మోహన్ రెడ్డితో సఖ్యతగా ఉండటం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. అటు షర్మిల కూడా అన్నతో విబేధించి తెలంగాణాలో పార్టీ కూడా పెట్టారు. ఈ మధ్య కాలంలో వైఎస్ విజయమ్మ ఎక్కడా జగన్ తో ఉండటం లేదు, ఆమె ఎక్కువగా షర్మిలతోనే కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా షర్మిల పార్టీలోని అన్ని ముఖ్యమైన మీటింగ్లకు ఆమె అటెండ్ అవుతూ వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆమె పై విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అద్యక్షురాలుగా ఉంటూ,మరో పార్టీ సమావేశంలో ఆమె ఎలా పాల్గుంటుంది అంటూ, విమర్శలు వచ్చాయి. ఇలా అనేక విమర్శలు, మరో పక్క జగన్ తో పోసగటం లేదనే ప్రచారం మధ్య, విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అంటూ ఈ రోజు వార్తలు వస్తున్నాయి. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అద్యక్షురాలు పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆమె పూర్తిగా కూతురు షర్మిల పార్టీలోనే ఆక్టివ్ రోల్ ప్లే చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆమె త్వరలోనే ప్రకటన చేస్తారని తెలుస్తుంది.
సెప్టెంబర్ రెండవ తేది, వైఎస్ పోయిన రోజు. ఆ రోజు విజయమ్మ ప్రకటన ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఎప్పుడూ లేనిది వైఎస్ విజయమ్మ ఆ రోజు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసారు. హైదరబాద్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. వైఎస్ క్యాబినెట్ లో పని చేసిన అనేక మంది మంత్రులకు, సన్నిహితులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి, ఆ రోజు లోటు పాండ్ రావలసిందిగా కోరారు. అయితే ఇది రాజకీయ సమావేశం కాదని చెప్తున్నారు. అన్ని పార్టీల్లో ఉన్న వైఎస్ సన్నిహితులకు పిలుపు వెళ్ళింది. మరి ఎంత మంది వస్తారో తెలియదు కానీ, పిలుపు అయితే వెళ్ళింది. ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇలాంటి సమావేశం నిర్వహించని విజయమ్మ ఇప్పుడు ఎందుకు ఈ సమావేశం పెట్టారు అనేది అర్ధం కావటం లేదు. అయితే జరుగుతున్న ప్రచారం మాత్రం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం షర్మిల పార్టీ బలోపేతంగా చెప్తున్నారు. మరి ఈ పరిణామాలు అన్నీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్ ఎలా తీసుకొంటారో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.