జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, ఆయన 16 నెలలు జైలు శిక్ష తరువాత, 2013లో బెయిల్ పై బయటకు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి, కండీషనల్ బెయిల్ పై బయట ఉన్నారు. ఇది ఇలా ఉంటే, జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి కావటం, ఆయన వ్యవహార శైలి కక్షసాధింపు ధోరణిలో ఉండటంతో, ఆయన సాక్షులను బెదిరిస్తున్నారు అంటూ, ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు సిబిఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే వాదనలు ముగియటంతో, ఈ కేసు పై నిన్న తీర్పు రావాల్సి ఉంది. దీంతో మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. లాయర్లు, మీడియా, జగన్ మనుషులు, పోలీసులు, ఇలా నాంపల్లి కోర్టు ప్రాంగణం మొత్తం హడావిడిగా అయిపొయింది. మొదటి గంటలోనే తీర్పు వస్తుందని అందరూ భావించారు. మూడు నాలుగు గంటలు అయినా, ఎక్కడా తీర్పు రాకపోవటంతో, టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. అందరూ టీవీలకు అతుక్కు పోయారు. అయితే, ముందుగా విజయసాయి రెడ్డి బెయిల్ పిటీషన్ పై, వాదనలు జరిగాయి. చాలా సేపు దీని పైనే వాదనలు జరిగాయి. విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రులను, ఇతర అధికారులను పదే పదే కలుస్తూ, తాను ఎంతో బలమైన వాడినని పరోక్షంగా సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంలో నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ప్రస్తావించారు. న్యాయస్థానాల పై వీరికి గౌరవం లేదని, అనేక సంఘటనలు ఉదాహరించారు. అయితే ఈ కేసుకి దీనికి సంబంధం లేదని, విజయసాయి న్యాయవాదులు వాదించగా, నిన్న సుప్రీం ఇచ్చిన తీర్పులో, వ్యక్తి స్వభావం చూసి కూడా బెయిల్ రద్దు చేయవచ్చు అనే లైన్ ఇందుకు సరిపోతుందని అన్నారు. ఇదే సందర్భంగా కోర్టుల పై ఏ మాత్రం గౌరవం లేకుండా, జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షిలో, జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి తీర్పు రాక ముందే, జగన్ బెయిల్ రద్దు అయిపొయింది అంటూ, ట్వీట్ చేసారని, ఆ ట్వీట్ చదివి వినిపించారు. ఇది చూసి కోర్టు ఆశ్చర్య పోయింది. మీ వాదనల్లోని అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని సరైన నిర్ణయం ప్రకటిస్తామని, జగన్ బెయిల్ రద్దు తీర్పు పై ఆర్ధర్ కాపీ ఇంకా రెడీ కాలేదు కాబట్టి, విజయసాయి, జగన్ ఇద్దరి పిటీషన్ల పై తీర్పుని, వచ్చే నెల 15న ప్రకటిస్తామని, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే చెప్పాలని, న్యాయవాదులను అడగగా, ఇరు పక్షాలు అంగీకరించటంతో, తీర్పుని 15వ తేదీకి వాయిదా వేసింది.