మూడు దశల్లో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, మహిళలను మోసగించి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక, అంచెలంచెలుగా మద్యం అమ్మకాలు పెంచుకుంటూ పోతున్నాడని, తన ఖజానా నింపుకోవడానికి కొత్త కొత్త పద్ధతులు అవలంభిస్తున్నాడని, టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 330 మిల్లీలీటర్లు, 200 మిల్లీలీటర్ల క్యాన్ లలో బీరు అమ్మకాలు చేయాలని, 180 ఎమ్.ఎల్ క్వార్టర్ బాటిల్ ను 90ఎమ్.ఎల్ క్వార్టర్ బాటిళ్లలో అమ్మాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ విధంగా తక్కువ సైజులో సీసాల్లో మద్యం అమ్మకాలు సాగించడం వల్ల ఎక్కువగా అమ్మకాలు చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోందా అని రఫీ ప్రశ్నించారు. 90 ఎమ్.ఎల్ సీసాను తేలిగ్గా జేబులో పెట్టుకొని వెళ్లి, ఎక్కడ పడితే అక్కడ తాగొచ్చన్నారు. చీప్ లిక్కర్ ధరను రూ.50 నుంచి రూ.200 వరకు పెంచితే మందు బాబులకు షాక్ కొడుతుందని, దానివల్ల మద్యం అమ్మకాలు పడిపోతాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నేడు మద్యం సీసాల సైజు తగ్గించి, ఎక్కువగా వినియోగం జరిగేలా ప్రణాళికలు వేయడం సిగ్గుచేటన్నారు. మద్యం అమ్మకాలు విరివిగా చేయాలనే ఆలోచనలు చేస్తున్న ముఖ్యమంత్రి ఎక్కడ మద్యపాన నిషేధం అమలు చేశాడో చెప్పాలని రఫీ డిమాండ్ చేశారు. జగన్ ఆలోచనలు మందుబాబులను ఆసుపత్రుల్లో పడేస్తుంటే, వారి కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్నాయన్నారు. ఏపీలో మద్యం తాగితే ప్రాణాపాయమనే వాస్తవం అన్ని రాష్ట్రాలకు తెలిసిందన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రతి వ్యక్తి మూడు సీసాల వరకు తెచ్చుకునే అవకాశమున్నా కూడా, ఏపీ పోలీసులు మందుబాబులను అలా చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వం అమ్మేదే ప్రజలు తాగాలన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో అన్ని దుకాణాలను మూసేయించిన జగన్ సర్కారు, మద్యం దుకాణాలను మాత్రం యథేచ్ఛగా కొనసాగించిందన్నారు.

ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాల కంటే తనకొచ్చే ఆదాయమే ముఖ్యమని లాక్ డౌన్ వేళల్లో జరిగిన మద్యం అమ్మకాలే రుజువు చేశాయని రఫీ చెప్పారు. ప్రభుత్వం అమ్ముతున్న నకిలీ మద్యం అమ్మకాలతో పేదల ఊపిరి తిత్తులు, కాలేయం వంటివి దెబ్బతింటున్నాయన్నారు. దానికి తోడు ఈ ప్రభుత్వం సిగ్గులేకుండా మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టిందన్నారు. ముఖ్యమంత్రికి చెందిన అనుచరులు, బంధువులకు చెందిన డిస్టిలరీ కంపెనీలే రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రికి అన్నా క్యాంటీన్లు మూయించడంపై ఉన్నశ్రద్ధ, మద్యం దుకాణాలు మూయించడంపై లేకుండాపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేధమంతా పచ్చి అబద్ధమని, ఆ విధంగా చెప్పి ఆడవాళ్లను దారుణంగా మోసగించాడన్నారు. షాపింగ్ మాల్స్, భారీ మాల్స్ లో ఎవరైనా మద్యం అమ్ముకుంటామంటే వారికి కూడా ఈ ప్రభుత్వం అనుమతులు ఇస్తోందన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సాకుగా చూపి ఈ ప్రభుత్వం ఇప్పటికే రూ.25వేలకోట్ల వరకు అప్పులు తీసుకొచ్చిందని, ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడానికే జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధమ నే నాటకాన్ని రక్తికట్టించాడన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read