ఇన్నాళ్ళు కోర్ట్ వాయిదాలు ఏదో ఒక సాకుతో తప్పించుకుంటూ, కాలం గడిపేస్తున్నా జగన్ మోహన్ రెడ్డి అండ్ కో కి, ఈడీ కోర్టు షాక్ ఇచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ, ఈడీ నుంచి పిలుపు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 22న తమ ముందుకు విచారణకు హాజరు కావాలి అంటూ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ, ఈడీ కోర్టు ఆదేశాలు ఇచ్చాయి. ముఖ్యంగా నిన్న ఈడీ , కోర్టులో మరో రెండు చార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడు చార్జ్ షీట్లు దాఖలు చేసిన ఈడీ, నిన్న మరో రెండు చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అందులో ఒకటి వాన్ పిక్ కేసు. అయితే ఈ చార్జ్ షీట్ ని, న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుందో లేదో అని అందరూ అనుకుంటున్న సమయంలో, ఈడీ కోర్టు, వాన్ పిక్ కేసుని విచారణకు తీసుకుంది. దీంతో జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరికే కాదు, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డికి పిలుపు వచ్చింది. ఈ కేసులో ఉన్న మోపిదేవి వెంకటరమణకు కూడా కోర్టు పిలుపు వచ్చింది. ఇక ఎమ్మెల్యే ధర్మాన, ఐఆర్టీఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డికి కూడా ఈ సమన్లు జారీ అయ్యాయి. ఇక ఈ కేసులో ఉన్న పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాశ్ కు కోర్టు సమన్లు జారీ చేసింది.
వీరితో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎం.శామ్యూల్, మన్మోహన్ సింగ్ కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఇక మొత్తంగా జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సీబీఐ, ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ కోర్టుకు వెళ్లి అక్కడ నుంచోవటం అంటే ఆయన ఇమేజ్ కు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మచ్చ. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తరువాత, కేవలం రెండు సార్లు మాత్రమే ఆయన కోర్టు విచారణకే హాజరు అయ్యారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, ప్రతి సారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. ఈ నేపధ్యంలో క-రో-నా రావటం, కోర్టులు వర్చ్యువల్ గా సమావేశం అవ్వటం జరిగినా, అక్కడ కూడా మినహాయింపు కోరారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి పిలుపు వచ్చింది. మరి ఆయన విచారణకు వెళ్తారో, లేదా ఏదైనా సాకు చెప్పి మినహాయింపు అడుగుతారో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ నెల 25న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు రానుంది.