రాష్ట్ర ఆర్థిక పరిస్థిపై ప్రధానే స్వయంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారన్న కథనాలు పత్రికల్లో వచ్చాయని, వాటిపై ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు ఎందుకు స్పందించలేదని, ప్రభుత్వ ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, ప్రజలందరూ ఇబ్బందిపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోందనేది వాస్తవం. ఈ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు, మంత్రలు ఎవరూ స్పందించరు. రాష్ట్ర ఆర్థికమంత్రి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఇద్దరూ అప్పుల కోసం ఢిల్లీలోనే చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర ఆదాయమెంత, అప్పులెన్ని అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదన్నారు. జగన్ ప్రభుత్వం కేవలం 25 నెలల్లోనే రూ.2లక్షల55 వేల కోట్ల అప్పు చేసింది. 2019-20లో రూ.39వేల కోట్లు, 2020-21లో రూ.55వేల కోట్లు, 2021-22లో జూన్ నాటికి దాదాపు రూ.60వేల కోట్ల అప్పులు చేశారు. ఆ విధంగా చేసిన రూ. లక్షా 40 వేల కోట్లు కాక, ఏ1, ఏ2లు తమకు నచ్చిన దొడ్డి దారిలో అప్పులు పొందడానికి చేయాల్సిందంతా చేశారు. కార్పొరేషన్లు సృష్టించి, భూములు తనఖా పెట్టి , ఎఫ్ఆర్ బీఎం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.56వేల కోట్ల వరకు అప్పులు తెచ్చారు. ప్రభుత్వం డైరెక్ట్ గా తెచ్చిన అప్పులు లక్షా 44వేల కోట్లయితే, ఇన్ డైరెక్ట్ గా కార్పొరేషన్ల ముసుగులో చేసిన అప్పులు రూ.56వేల కోట్లు. ఈవిధంగా చేసిన అప్పులు కాకుండా ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు రూ.45వేల కోట్ల వరకు ఉన్నాయని సీఎఫ్ఎంఎస్ లోని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యవస్థలో ఏం జరుగుతోందో ఏ అధికారికి తెలియడంలేదు. ఉద్యోగస్తుల కు జీపీఎఫ్ అడ్వాన్సులు, డీఏ చెల్లింపులు, పింఛన్లు కూడా చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. డీఏలు ఉద్యోగుల ఖాతాల్లో వేసినట్లే వేసి తిరిగి వెనక్కు తీసుకోవడ జరిగింది. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు కలిపితే ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు రూ.2లక్షల 40వేల కోట్ల వరకు ఉన్నాయి. ఆదాయం లేకుండా ప్రభుత్వం అప్పులభారాన్ని ఏంచేస్తుందనే ప్రశ్న ప్రతిఒక్కరిలోనూ ఉంది. మద్యం, పెట్రోల్ డీజిల్ పై వచ్చే వ్యాట్, జీఎస్టీలపై వచ్చే ఆదాయంతో పాటు, కేంద్ర ప్రభుత్వమిచ్చే నిధులు కూడా రాష్ట్రానికి బాగానే వస్తున్నాయి. సంక్షేమ పథకాలకు రూ. 95వేలకోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. రూ.95వేల కోట్లు పోయినా కూడా మిగిలిన ఆదాయంతో పాటు, తెచ్చిన అప్పుల తాలూకా సొమ్మంతా ఏమైందో ప్రభుత్వం చెప్పాలి.

రూ.45వేల కోట్ల అప్పుల కోసం ఇప్పటికే రాష్ట్ర ఆర్థికమంత్రి ఢిల్లీలో తిరుగుతున్నాడు. కానీ కేంద్ర పెద్దలు ఇప్పటికే రాష్ట్రం మితిమీరి అప్పులు చేసింది కాబట్టి, తామేమీ ఇవ్వమని తెగేసి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఈప్రభుత్వం ఏంచేస్తుందో చూడాలి. వచ్చే నెలలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే, ఉద్యోగులకు జీతాలు ఆపాల్సిన పరిస్థితి. ఇవన్నీకేంద్ర ప్రభుత్వానికి తెలియబట్టే, మోదీ జగన్ ప్రభుత్వం అప్పుల పరిధి దాటిపోయిందని చెప్పారు. చివరకు జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లోని సొమ్ముని కూడా తీసేసు కుంటోంది. ఉద్యోగుల జీతాలు ఆపితే, వారు కచ్చితంగా కోర్టులను ఆశ్రయించడం ఖాయం. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా అరకొరగానే అమలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలపేరుతో ప్రజలకు ఖర్చు పెట్టింది కేవలం రూ.95వేల కోట్లయితే, మిగిలిన రూ.3లక్షల50వేల కోట్ల సొమ్ము ఏమైందంటే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని, జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం చెల్లింపులు చేసింది. ఆ వ్యవహారం కేంద్రానికి తెలియబట్టే, ప్రధాని ఏపీ ప్రభుత్వతీరుపై సీరియస్ అయ్యారన్న కథనాలు చూస్తున్నాం. ఏపీ కంటే చిన్నరాష్ట్రాలైన రాజస్థాన్, ఒడిశా ఆదాయం ఎక్కువ, అప్పులు తక్కువగాఉన్నాయి. ఏపీప్రభుత్వం అప్పులపై బరితెగించ బట్టే, కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రూ.41వేలకోట్ల చెల్లింపులకు లెక్కలు చెప్పమని ఆదేశించింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, విద్యుత్ డిస్కంలు, స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దాదాపు రూ.30వేల కోట్ల వరకు అప్పులు తెచ్చింది. బేవరేజెస్ కార్పొరేషన్ లోని స్టాక్ ను రూ.1400కోట్ల అప్పు కోసం ప్రభుత్వం తాకట్టుపెట్టింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పినవారు, చివరకు మద్యం తాగిస్తాం.. అప్పులివ్వండి అనేస్థితికి వచ్చారు. ఇంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉంటుందా? 

Advertisements

Advertisements

Latest Articles

Most Read