మంత్రి అవంతి శ్రీనివాస్ తన పేరటి సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియో లీక్ పై స్పందించారు. నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇది తన పై జరుగుతున్న తప్పుడు ప్రచారం అని అన్నారు. తనకు ఎవరితోనే శత్రుత్వం అనేది లేదని, మరి తన పై ఎందుకు ఇలా కావాలని విష ప్రచారం చేస్తున్నారో తెలియటం లేదని అన్నారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని కొంత మంది చూస్తున్నారని అన్నారు. తనకు దేవుడి మీద నమ్మకం ఉందని, ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు అంటూ, అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. పార్టీలో కూడా తన ప్రతిష్ట దెబ్బ తీయాలని ఎవరో ప్రయత్నం చేసినట్టు అర్ధం అవుతుందని అన్నారు. ఈ ఆడియో లీక్ పై, పూర్తి స్థాయిలో విచారణ చేయమని, పోలీస్ కమిషనర్ ని కోరానని, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని, పోలీస్ వాళ్ళే ఇందులో ఏమి ఉందో తేలుస్తారని అన్నారు. ఈ ఆడియోలో నిజా నిజాలు అన్నీ పోలీస్ వారే చెప్తారని అవంతి అన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని, చేసే కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తిని అని, అందుకే తన పై ఈ కుట్రలు చేస్తున్నారని అన్నారు. కొంత మందికి ఈ ధోరణి నచ్చటం లేదేమో అని వ్యాఖ్యానించారు.
తన రాజకీయ ప్రత్యర్ధుల పై కూడా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, తన రాజకీయ ఎదుగుదల చూసి, కొందరు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఈ రెండున్న ఏళ్ళలో, అవినీతి ఆరోపణలు కూడా ఎవరూ చేయలేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తాను సెల్ఫ్ మేడ్ అని, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని అని అన్నారు. మహిళల్లో కూడా తమకు మంచి ఆదరణ ఉంది కాబట్టి, మహిళల్లోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో మంచి కంటే, ఎక్కువ వెళ్తుందని అన్నారు. అయితే ఈ `సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ, మీరు కంప్లైంట్ ఇచ్చింది, సోషల్ మీడియాలో మీ ఆడియో వైరల్ చేస్తూ, మిమ్మల్ని కించ పరుస్తున్నారనా ? లేదా అసలు ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా మీదు కాదని చెప్తున్నారా ? అని వాయిస్ గురించి అడగగా, అవంతి మాట దాటేసారు. వాయిస్ గురించి పోలీస్ విచారణలో తేలుతుంది అంటూ, సమాధానం చెప్పి తప్పించుకున్నారు. మరి దీని పై పోలీసులు ఏమి తేలుస్తారు ? ఏమి జరుగుతుంది అనేది చూడాలి.