జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు , 2012 నుంచి నడుస్తూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండటం, తరువాత బెయిల్ మీద బయటకు రావటం, ముఖ్యమంత్రి అవ్వటం, ఇప్పుడు బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్లు, ఇవన్నీ ఒక పక్క నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ కేసులు ఇంకా ట్రైల్స్ కు రాలేదు. ఇంకా డిశ్చార్జ్ పిటీషన్ల దగ్గరే నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఈ రోజు మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రోజు మరో రెండు కొత్త చార్జ్ షీట్లతో, జగన్ పై అభియోగాలు మోపుతూ, కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేసింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. ఒక పక్క 25వ తేది జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై తీర్పు వస్తున్న నేపధ్యంలో, ఇప్పుడు కొత్తగా మరో రెండు చార్జ్ షీట్లు నమోదు చేయటం చర్చకు దారి తీసింది. సిబిఐ వేసిన చార్జ్ షీట్ల ఆధారంగా, ఈడీ ఈ అంశం పై నేరుగా విచారణ జరిపింది. సిబిఐ ఇప్పటికే జగన్ అక్రమ ఆస్తుల కేసులు పై, ఇప్పటికే 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అయితే వాటి ఆధారంగా దార్యప్టు చేసి, ఈడీ ఇప్పటి వరకు ఏడు చార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఇప్పటికే సిబిఐ వేసిన 11 చార్జ్ షీట్లను, అలాగే ఈడీ వేసిన మరో ఏడు చార్జ్ షీట్లను, పరిగణలోకి తీసుకున్న కోర్టు, వాటి పై విచారణ జరుపుతుంది.
అయితే ఇప్పటికే దాఖలు చేసిన ఏడు చార్జ్ షీట్లతో పాటుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు మరో రెండు కొత్త చార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ రోజు ఇవి కూడా కోర్టుకు సమర్పించింది. ఇందులో ముఖ్యంగా వాన్పిక్ తో పాటుగా, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అనే రెండు అంశాలకు సంబంధించి, ఈ చార్జ్ షీట్లను సమర్పించింది. వీటికి సంబంధించి, గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెయ్యి కోట్ల ఆస్తుల వరకు జప్తు కూడా చేసింది. వాన్పిక్ ఓడరేవు నిర్మాణానికి సంబంధించి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో, అధికార దుర్వినియోగం జరిగింది అనే ఆరోపణతో, సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. వాటి ఆధారంగా, మనీ లాండరింగ్ ఆరోపణలతో, దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసు విషయంలో చార్జ్ షీట్ నమోదు చేసారు. ఇక మరో కేసు అయిన లేపాక్షి నాలెడ్జ్ హబ్ విషయంలో కూడా మనీ లాండరింగ్ ఆరోపణలతోనే చార్జ్ షీట్ నమోదు చేసారు. కోర్టు ఈ రెండు పరిగణలోకి తీసుకుంటే, దీని పై కూడా విచారణ మొదలు కానుంది.