హెటిరో డ్రగ్స్, ఈ కంపెనీ గతంలో జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ఏ4గా ఉంది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, క్విడ్ ప్రోకో ద్వారా జగన్ మోహన్ రెడ్డి కంపనీల్లో, పెట్టుబడి పెట్టారు. చివరకు సిబిఐ కేసుల్లో చిక్కుకున్నారు. ఈ కేసులు నడుస్తూనే ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెటిరో డ్రగ్స్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చయి. విశాఖలో అనేక భూములు కట్టబెట్టారు అనే ప్రచారం జరిగింది. అలాగే కొన్ని ప్రభుత్వ పనులు కూడా హెటిరో డ్రగ్స్ కు అప్పగించారు. ఇక అలాగే విశాఖలో ఉన్న బేపార్క్ హెటిరో డ్రగ్స్ కొనటం వెనుక కూడా భారీ స్కెచ్ ఉందనే ప్రచారం జరిగింది. టిడిపి హెటిరో డ్రగ్స్ పేరుతో జగన్ మోహన్ రెడ్డి 300 కోట్లతో, బేపార్క్ కొన్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే ఈ మధ్య కాలంలో హెటిరో డ్రగ్స్ అధినేత భారీగా ఆస్తులు పెరిగిన జాబితాలో చేరారు. వీటి అన్నిటి నేపధ్యంలో, కేంద్రం కన్ను హెటిరో డ్రగ్స్ పై పడింది. నిన్నటి నుంచి హెటిరో డ్రగ్స్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా విస్తృత సోదాలు జరుగుతున్నాయి. దాదాపుగా 20 బృందాలతో, వివిధ చోట్ల హెటిరో డ్రగ్స్ కార్యాలయాల పై ఐటి సోదాలు జరుగుతన్నాయి. ఈ సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్లు దొరికినట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా ఐటి శాఖకు వచ్చిన సమాచారంతో, సోదాలు చేస్తున్నారు. పన్ను ఎగవేత, తప్పుడు బిల్లులు, ఇలా అనేక ఆరోపణలతోనే ఐటి శాఖ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి జరుగుతున్న సోదాల్లో, హెటిరో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఐటి సోదాల్లో హెటిరో కార్పొరేట్ ఆఫీస్ లో భారీగా నగదు గుర్తించినట్టు చెప్తున్నారు. దొరికిన నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే ట్యాక్స్ చెల్లింపుల్లో కూడా భారీగా అవకతవకలు గుర్తించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ముడి సరుకు దిగుమతి చేసుకున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ క్రమంలో ఎగుమతి, దిగుమతిలో భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని, విలువ తక్కువ చేసి ఇన్వాయిస్లు సృష్టించినట్లుగా గుర్తించారు అంటూ, మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సోదాలు ఇంకా ముగియలేదని, శనివారం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీని పై సోదాలు ముగిసిన తరువాత, ఐటి శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.