ఏ చెట్టూలేని ఎడారిలో ఆముదం చెట్టే మహా వృక్షం. కూల్చడమే తప్పించి కట్టడం తెలియని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసిన నాలుగేళ్లకి పులివెందుల బస్టాండు నిర్మాణం పూర్తి చేయగలిగారు. ఇదేదో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు వైసీపీ పెద్దలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అతి ఎక్కువగా ట్రోలింగ్ కి గురైనది పులివెందుల బస్టాండు విషయంలోనే అన్నది సుస్పష్టం. ఐదేళ్ల టిడిపి పాలనలో అమరావతి రాజధాని నిర్మించలేకపోయారని ఆరోపించిన వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తనను గెలిపించిన పులివెందులలో బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పూర్తి చేయలేదు. దీంతో సోషల్మీడియాలో జగన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో బస్టాండు కట్టలేనోడు, అమరావతి నిర్మాణం గురించి ఆరోపణలు చేయడం అర్థరహితం అంటూ సెటైర్లు పేల్చారు. సొంతూరులో బస్టాండు కట్టలేనోడు మూడు రాజధానులు ఏం కడతాడంటూ మరో కోణంలోనూ ఎదురుదాడి చేశారు నెటిజన్లు. అమరావతిలో నిర్మాణాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవ చేసిన వైసీపీ నేతలూ పులివెందుల బస్టాండు కూడా గ్రాఫిక్సే కదా అంటూ ఎద్దేవ చేశారు.

ఈ ట్రోలింగ్ భరించలేని వైసీపీ సోషల్మీడియా వింగ్ సీఎం వద్దకే నేరుగా వెళ్లి విషయం చెప్పింది. పులివెందుల బస్టాండు పూర్తి చేయలేకపోతే టిడిపి,విపక్ష సోషల్మీడియా పోస్టులకు సమాధానం చెప్పలేకపోతున్నామని జగన్ దగ్గర వాపోయారు. దీంతో సీఎం నేరుగా కల్పించుకుని ఎన్ని అడ్డంకులున్నా పులివెందుల బస్టాండు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. శంకుస్థాపన చేసిన మూడేళ్లకు పులివెందుల బస్టాండు పూర్తి అయ్యింది. దాదాపు రూ. 37 కోట్ల వ్యయంతో పులివెందుల బస్టాండు పూర్తి చేశారు. ప్రయాణికుల రద్దీ ఈ స్థాయిలో లేకపోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఇంత భారీ బస్టాండు నిర్మించారనుకుంటే పొరపాటే. కుప్పంలో చంద్రబాబు హయాంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణమైన బస్టాండు ఫోటోలు పెట్టి, పులివెందుల కొబ్బరి తడికెల బస్టాండుతో పోల్చి సోషల్మీడియాలో వైసీపీని ఒక ఆట ఆడుకుంటున్నారు. దీంతో కుప్పం బస్టాండు కంటే ఘనంగా నిర్మించాల్సిందేనని జగన్ పట్టుబట్టి కట్టించిన పులివెందుల బస్టాండు ఎట్టకేలకు పూర్తి అయ్యింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read