కాపు జాతికి సంబంధించిన అతిపెద్ద సమస్య చర్చకి వచ్చిన దశలో జాతి కోసం నా ప్రాణాలు ఇస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసిన ముద్రగడ పద్మనాభం కనపడకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ముద్రగడ నిద్రపోయారా? నిద్ర నటిస్తున్నారా? అనేది కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన నేతలకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి సర్కారుపై ఒంటికాలిపై లేచే ముద్రగడ...అదే జగన్ సీఎం కావడంతో దీర్ఘనిద్రలోకి వెళ్లిపోవడం సహ ఉద్యమకారులకు ఏం చేయాలో అంతుబట్టటంలేదు. కేంద్రం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసులు, వివాదాలలో ఉండగానే ఏపీలో టిడిపి సర్కారు దిగిపోయి వైసీపీ సర్కారు వచ్చింది. వైఎస్ జగన్ రెడ్డి సీఎం కాగానే టిడిపి కాపులకు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు ఎత్తేశారు. దీనిపై కనీసం ఒక ప్రకటన కూడా విడుదల చేయని ముద్రగడ తీరుపై కాపు నేతల్లో అనుమానాలు మొదలయ్యాయి.
తాజాగా కేంద్రం కూడా కాపులకి చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చట్టబద్ధమేనని, ఇది కొనసాగించాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని తేల్చేసింది. దీనిపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు, వైసీపీలో కాపు నేతలు తేలు కుట్టిన దొంగల్లా మౌనం నటిస్తున్నారు. వీరితోపాటు ముద్రగడ కూడా నిద్ర నటించడం అనుమానాలకు తావిస్తోంది. కాపులకు టిడిపి ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ ని వైసీపీ అమలు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన పద్మనాభం.. అసలు నోరు కూడా మెదపకుండా మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ రెడ్డిని సీఎం చేయడం కోసం పనిచేసిన ప్యాకేజీ స్టార్లలో ముద్రగడ ఒకరని, జగన్ సీఎం కావడంతో తెరవెనక్కి వెళ్లారని ఆరోపణలున్నాయి. కాపుల రిజర్వేషన్లు అని పోరాడిన ముద్రగడ, జగన్ కాపుల రిజర్వేషన్లు పీకేసినా స్పందించకపోవడంతో..పద్మనాభం జగన్ వదిలిన బాణమని తేటతెల్లమవుతోంది.