జగన్ రాముడిలాగే ఒకటే బాణం, ఒకటే భార్య అని తన సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. విలువలు, విశ్వసనీయత అంటూ పెద్దపెద్ద మాటలని కూడా జగన్ కి అన్వయిస్తూ ఐప్యాక్ క్యాంపెయిన్లు రన్ చేస్తుంది. ఒకటే బాణాన్ని వదిలేశాడని, భార్య మాత్రమే ఒక్కటేనని, విలువలు లేవు, విశ్వసనీయతకి అర్థమే తెలియదు అంటూ జనసైనికులు ఎదురుదాడి చేస్తుంటారు. జనసేనకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేనీ తన ఫ్యాన్‌గా మార్చుకున్న జగన్ జనసేనాని మాత్రం సందర్భం ఏదైనా టార్గెట్ చేస్తూనే వుంటారు. తన వెంట్రుక ఎవ్వరూ పీకలేరంటూనే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు వైసీపీ అధినేత. ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేతగా వున్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్భం కాకపోయినా టార్గెటెడ్‌గా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు విషయం బహిరంగసభలలో ప్రస్తావించేవారు. కొందరిలా నేను నాలుగు పెళ్లిళ్లు చేసుకోలేదని పరోక్షంగా పవన్ ని ఎద్దేవ చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక కూడా పవన్ పెళ్లిళ్లు జగన్ విమర్శలకు ఆయుధంగా మారింది.
మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు అని మనం అంటుంటే మూడు పెళ్లిళ్ల వల్లే మేలు అని, మీరూ చేసుకోండి అని ఒకాయన పిలుపునిస్తున్నారని పవన్ పై ఆరోపణలు గుప్పించారు జగన్. ఆయనని ఆదర్శంగా తీసుకుని విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఆడవాళ్లు, చెల్లెళ్లు, కూతుర్ల పరిస్థితి ఏంటి? అని జగన్ అవనిగడ్డ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తన సొంత జిల్లా పర్యటనకి వెళ్లిన సీఎం జగన్ రెడ్డి..ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను కొందరిలా అనడంలేదు అంటూ పవన్ పెళ్లిళ్లపై సెటైర్లు వేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి విడాకులు ఇచ్చిన భార్యలు హాయిగా వున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్నామె సంతోషంగా ఉంది. వారి పెళ్లిళ్లు, విడాకులు గురించి జగన్ రెడ్డి ఎందుకంత బాధపడిపోతున్నారోనని జనసైనికులు కౌంటర్లు వేస్తున్నారు.