రాష్ట్ర విభజన తరువాత ఎనిమిదేళ్లలో తెలంగాణలో తెలుగుదేశం ప్రభ తగ్గుతూ వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా టిడిపికి పల్లెపల్లెనా కేడర్ ఉంది. నడిపించే నాయకుడి మౌనం ఇన్నాళ్లూ టిడిపిలో నిస్తేజం నెలకొంది. పదవులు అనుభవించిన పెద్ద పెద్ద నేతలు పార్టీలు మారిపోయినా..సెకండ్ కేడర్ మాత్రం చెక్కుచెదరలేదు. టిడిపి గ్రామస్థాయి అభిమానులైతే ఎప్పటికైనా తమ పసుపు జెండా రెపరెపలు చూస్తామనే ఆశతో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో టిడిపి అధికారంలోకి రావడంతో పాలనలో తలమునకలైన చంద్రబాబు తెలంగాణ పార్టీ పట్ల అంతగా శ్రద్ధ చూపించలేదు. ఇదే అదనుగా టిడిపి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు, కొందరు నేతలు పార్టీని వీడిపోయారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఓటమి తరువాత చంద్రబాబుతోపాటు టిడిపిలో మథనం మొదలైంది. తెలంగాణ, ఏపీలోనూ గ్రామస్థాయి నుంచి టిడిపికి బలమైన నిర్మాణం ఉన్నా..ఒకచోట ఓటమి, మరో చోట నిస్తేజానికి గల కారణాలని విశ్లేషించారు. ఏపీలో ప్రతిపక్షంగా టిడిపి నిరంతరం ప్రజలపక్షాన పోరాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కడం ఖాయం అని నమ్మకం కలిగించగలిగారు. తెలంగాణలోనూ యువనేతలు, పాతతరం సంప్రదాయ నేతలు కూడా దూకుడు రాజకీయాలతోనే ముందుకెళ్లగలం అని డిసైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో బక్కని నర్సింహులు స్థానంలో కాసాని జ్ణానేశ్వర్ ని తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు.అప్పటి నుంచి తెలంగాణపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోకస్ పెంచారు. టిడిపిలో చేరికలు కూడా ఊపందుకున్నాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీని వీడి వెళ్లిన నేతలను కూడా తిరిగి తెలుగుదేశంలో చేర్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. కేడర్ కి భరోసా కల్పించేందుకు ఓ భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. తెలంగాణలో మొట్టమొదటి సారిగా నిర్వహించే సభకి ఖమ్మంని కేంద్రంగా ఎంచుకున్నారు. బుధవారం ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే చంద్రబాబు భారీ కాన్వాయ్ కి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఘన స్వాగతం పలికేందుకు టిడిపి కేడర్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.