ప్రభుత్వాధినేతగా ఉండి, ప్రభుత్వరంగ డెయిరీలను, వాటితాలూకా ఆస్తుల్ని కాపాడి, పాడి రైతులకు న్యాయంచేయాల్సిన ముఖ్యమంత్రి, గుజరాత్ సంస్థ అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, తనపై ఉన్న కేసులభయం, కమీషన్లకక్కుర్తితోనే జగన్ రెడ్డి రాష్ట్రపాడిపరిశ్రమను, డెయిరీలను అమూల్ పరంచేయడానికి సిద్ధమయ్యాడన్నారు. విలేకరులసమావేశంలో ఆయన మాట్లాడిన వివరాలు క్లుప్తంగా మీకోసం...! "అమూల్ సంస్థకోసం చిత్తూరు, ఒంగోలు డెయిరీలను నిర్వీర్యంచేయడం దుర్మార్గం. రాష్ట్రంలోని కోఆపరేటివ్ డెయిరీలను అమూల్ పరంచేయడంలోని ఆంతర్యం ఏమిటో జగన్ సమాధానం చెప్పాలి. తనపై ఉన్న అవినీతికేసుల్ని మాఫీచేసుకోవడానికి, కమీషన్లకక్కుర్తితోనే ముఖ్యమంత్రి రాష్ట్ర పాడిపరిశ్రమను అమూల్ పరంచేస్తున్నాడు. చిత్తూరు డెయిరీ ఆస్తుల విలువ రూ.350కోట్లు. చిత్తూరు డెయిరీ 25ఎకరాల విస్తీర్ణంలో, పట్టణం నడిబొడ్డున ఉంది. వి.కోట, మదనపల్లె, పీలేరు, కాళహస్తి, పిచ్చాటూరు ప్రాంతాల్లో 50వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 5 చిల్లింగ్ సెంటర్లు చిత్తూరు డెయిరీ కింద ఉన్నాయి. ఒక్కో చిల్లింగ్ కేంద్రం 5 ఎకరాలకు విస్తీర్ణంలో ఉంది. చిత్తూరుడెయిరీకి సంబంధించిన యంత్రసామగ్రి దశాబ్దాలక్రితమే జర్మనీ, డెన్మార్క్ వంటి దేశాలనుంచి తెప్పించారు. ఆ సామగ్రి విలువే రూ.30కోట్లు పైన ఉంటుంది. దేశంలోనే పేరు ప్రఖ్యాతిగాంచి, 1982లో ఎంఎన్ పీవోగా ప్రారంభమైన చిత్తూరు డెయిరీని నేడు ఎక్కడినుంచో వచ్చిన అనామకసంస్థ పరంచేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
చిత్తూరు డెయిరీని ఏడాదికి రూ.కోటిచొప్పున 99ఏళ్లపాటు అమూల్ కు లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పాదయాత్రసమయంలో చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని డెయిరీలతో పాటు, రాష్ట్రంలోని కో ఆపరేటివ్ డెయిరీలను ఆదుకుంటానని, తాను ముఖ్యమంత్రి అయితే, ప్రభుత్వపరంగా వాటిని అదుకుంటానని జగన్ రెడ్డి చెప్పాడు. మూతపడిన డెయిరీలను తెరిపిస్తానని, వాటిపరిధిలోని షుగర్ ఫ్యాక్టరీలను కూడా రీ ఓపెన్ చేయిస్తానని నమ్మబలికాడు. పాడిరైతులకు లీటర్ కు రూ.4లు బోనస్ గా చెల్లిస్తానన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక పాడిరైతుల్ని పచ్చిగా మోసగించి, అమూల్ సంస్థకోసం అర్రులుచాస్తున్నాడు. ప్రభుత్వ డెయిరీ అయిన విజయడెయిరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాల్సిన ముఖ్యమంత్రి, అమూల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.ప్రైవేట్ డెయిరీలకంటే అమూల్ డెయిరీ పాడిరైతులకు లీటర్ పాలకు రూ.2, రూ.3లు తక్కువే ఇస్తోంది. పాడిరైతులు అమూల్ సంస్థకు పాలుపోయడాన్ని ఇష్టపడంలేదు. కానీ ప్రభుత్వం వారిని బెదిరించి అమూల్ కు అనుకూలంగా పనిచేయిస్తోంది. అమూల్ డెయిరీ గుజరాత్ సంస్థ. గుజరాత్ వ్యాపారులు రాష్ట్రంలోని పాడిపరిశ్రమపై వచ్చే సంపదను దోచుకుంటారు గానీ, పాడిరైతులకు ఎలాంటి న్యాయంచేయరు. పాడిరైతుల్ని బలిపశువుల్ని చేయడానికే జగన్ రెడ్డి అమూల్ సంస్థ సేవలో తరిస్తున్నాడు. రాష్ట్రంలో 13సహకార, 7 ప్రైవేట్ డెయిరీలు ఉండగా, వాటినిక కాదని గుజరాత్ కు చెందిన అమూల్ తో ఒప్పందంచేసుకోవడం జగన్ రెడ్డి స్వార్థప్రయోజనాలకు నిదర్శనం. అమూల్ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు. రాష్ట్రంలోని ఇతర పాడిపరిశ్రమలకు తీరనినష్టాలనే మిగులుస్తాయి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా పొరుగువారికి మేలుచేయడం మానేసి, సొంతరాష్ట్రంలోని డెయిరీలకు అండగా నిలవాలి.