ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవటం పై, పార్లమెంట్ దృష్టికి వచ్చింది. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇబ్బందులపై టీడీపీ ఎంపీ కనకమేడల రాజ్యసభలో ప్రస్తావించారు. ఏపీలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈరోజుకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన రాజ్యసభకు తెలిపారు. జీతాలు ఇవ్వడానికి కూడా కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సబ్‍ప్లాన్ కింద కేంద్రం ఇస్తున్న నిధులను ఏపీలో పెద్ద ఎత్తున దారి మళ్లిస్తున్నారని, రాజ్యసభ దృష్టికి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్‍ప్లాన్ కింద కేంద్రం ఇచ్చిన రూ.8,400 కోట్లు, రూ.1000 కోట్లను దారి మళ్లించారని చెప్పారు. జీవోలు, మెమోలు ఇచ్చి మరీ నిధులను దారి మళ్లిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్న విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు కూడా ఏపీలో పర్యటించి నిర్ధారించారని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో భూములను అధికార పార్టీ నేతలు భారీగా ఆక్రమిస్తున్నారని, అలాగే గిరిజన ప్రాంతాల్లో వైద్యం సహా కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. గర్భిణులను నలుగురైదుగురు కలిసి కిలోమీటర్ల మేర మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయని, వాల్మీకి బోయలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి దీనికి సంబంధించి 2017లో టీడీపీ హయాంలో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం అని టీడీపీ ఎంపీ కనమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభకు చెప్పారు. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కూడా, కేంద్రం ఇచ్చే నిధులని దారి మళ్ళించి, జీతాలు ఇచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారని, ఈ విషయం పై కేంద్రం దృష్టి సారించి, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాన్ని ఆపాలని, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని తెలిపారు. మొత్తానికి రాష్ట్రంలో గత రెండు వారులుగా జీతాలు రాలేదనే సంగతి ఇప్పుడు రాజ్యసభలో కూడా మారు మోగింది. ఈ విషయం తెలిసి రాజ్యసభ కు ఆశ్చర్యపోయింది.