ఏపీలో చాలా పార్టీలు మారారు. ఇంకా మారడానికి పార్టీలు లేవు. వచ్చే ఎన్నికల్లో కనీసం తాము ఉన్నామని రాజకీయ పార్టీలకైనా సంకేతాలు ఇచ్చేందుకు ఓ పార్టీ కావాలి. ఇలా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న కొందరు రాజకీయ నిరుద్యోగులకు బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. వీరే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధిలు. వీరంతా ఏపీలో లేని బీఆర్ఎస్లో చేరబోతున్నారు. ప్రత్తిపాడు నుంచి 2014 లో రావెల కిషోర్ బాబు ఎమ్మెల్యే గా గెలిచి మంత్రిగా భాద్యతలు స్వీకరించారు. మంత్రివర్గం నుంచి తీసేయడంతో ఆ తరువాత ఎన్నికలకు జనసేనలో చేరారు. కొద్ది కాలానికే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ 2009 లో పీఆర్పీ నుంచి గుంటూరు పార్లమెంట్ కు పోటీ చేశారు. 2014 లో వైసీపీ ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ కు పోటీచేశారు. 2019 లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పోటీచేసిన ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి గెలవని తోట చంద్రశేఖర్ ఇప్పుడు బీఆర్ఎస్లో చేరబోతున్నారు. పార్టీలు, కండువాలు మార్చడమే తప్పించి ఎన్నికలకు పనికొచ్చే నేతలు కాదని తేలిపోవడంతో ఏపీలో ఏ పార్టీ నుంచి వీరికి పిలుపు రాలేదు. బీఆర్ఎస్లోనూ ఎవరూ ఏపీ నుంచి చేరడంలేదు. ఇరువురూ ఎదురుచూస్తున్నది ఒకటే కావడంతో వీరి చేరికకు మార్గం సుగమం అయ్యింది.
పార్టీలు, కండువాలు మార్చడమే తప్పించి ఎన్నికల్లో గెలవని ఈ జంపింగ్ జపాంగ్ లతో, ఏపిలో కేసీఆర్ ఆడే గేం ఏంటి ?
Advertisements