అప్పట్లో టిడిపి మాజీ మంత్రి పరిటాల రవిని అత్యంత దారుణంగా హత్య చేసినట్టే, మాచర్లలో టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని అంతమొందించాలని చూశారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బ్రహ్మారెడ్డిని చంపించేందుకు పోలీసులే స్కెచ్ వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడులో వరసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని స్పష్టం అయ్యిందన్నారు. ప్రజల మద్దతు కోల్పోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరలేపారని పేర్కొన్నారు. ఆరిపోయే దీపం లాంటిది వైకాపా ప్రభుత్వం అనేది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి గుర్తుంచుకోవాలని టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. టిడిపికి చెందిన ఎస్సీ, ఎస్టీ,బీసీ నాయకుల్ని పోలీసులతో పిన్నెలి కొట్టిస్తున్నాడని, తెలుగుదేశం నేతల్ని హింసించే పోలీసులెవ్వరికీ భవిష్యత్తులో ఉద్యోగాలుండవని హెచ్చరించారు. బరితెగించిన మాచర్ల పోలీసుల్ని డీజీపీ అదుపులో పెట్టకపోతే వారి పరిస్థితి ఇక ఆగమ్యగోచరమేనన్నారు. పోలీసుల నిర్బంధాలకు, వైసీపీ దాడులకు తెదేపా నేతలెవ్వరూ భయపడట్లేదని తేల్చి చెప్పారు. నిర్బంధాలు ఉన్నచోటే తిరుగుబాటు ఉంటుందని గుర్తించాలని హితవు పలికారు. మాచర్ల పోలీసులు అమాయకులపైన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి వెల్దుర్తి, సాగర్ పోలీస్ స్టేషన్లలో పెట్టి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ని కలిసిన టిడిపి నేతలు మాచర్ల లో జరిగిన ఘటన కు సంబంధించి వీడియో ఫుటేజ్,వైసీపీ నేతలు దాడికి ముందు మారణయుధాలు పట్టుకుని తిరిగిన ఫొటోలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read