ఎన్నికలకు ముందు అన్నివర్గాలకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలు తప్పించి ఇతరత్రా ఏ హామీలు నెరవేర్చే స్థితి లేదు. క్రమంతప్పకుండా ప్రతి ఏటా డిఎస్సీ వేస్తామని వేయలేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ ప్రతీ ఏటా జనవరి1న ఇస్తామన్న జాబ్ క్యాలెండరూ ఇవ్వలేదు. నాలుగేళ్లు పూర్తి కావస్తున్న నేటికీ కూడా టీచర్ ఉద్యోగాలు భర్తీకి ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. కొత్త పరిశ్రమలు రాక, ఉన్నవి తరలిపోతున్న సంక్షోభ పరిస్థితుల్లో ఏపీలో ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. నిరుద్యొోగులు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వలస పోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి సర్కారు నిరుద్యోగ యువతకు చేపల కూర పథకం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం డ్వాక్రా మహిళలూ సద్వినియోగం చేసుకోవచ్చని ప్రకటించింది. చేపలు, రొయ్యలతో రకరకాల వంటకాలు తయారు చేసేందుకు శిక్షణ ఇవ్వడంతోపాటు అవి అమ్ముకునేందుకు కర్రీ పాయింట్లలా ఏర్పాటు చేసుకోవడానికి రుణాలూ ఇవ్వాలని వైసీపీ సర్కారు ఆలోచిస్తోంది.
ఇప్పటికే చేపలు, రొయ్యల దుకాణాలను ఫిష్ ఆంధ్రా పేరుతో ఆర్బాటంగా ఆరంభించి మూసేశారు. మటన్ మార్టులూ మాయం అయ్యాయి. ఫిష్ ఆంధ్రా ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు చేపలు, రొయ్యల వంటకాలతో రెస్టారెంట్లు పెట్టుకోవాలని నిరుద్యొోగులకు సర్కారు ఆఫర్ ఇస్తోంది. ఈ హోటళ్ల ఏర్పాటుకు అవసరమైన రాయితీ రుణాలను బ్యాంకుల నుంచి ఇప్పిస్తామని జగన్ ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల వంటలు చేయడంలో శిక్షణ ఇస్తామని, స్వయం ఉపాధి రుణాల మోడల్లోనే లబ్ధిదారుల వాట, రాయిితీతో రుణం ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెబుతున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతూ..కొత్తవి రాని దశలో ఈ చేపల కూర వండే పథకంలో యువత చేరతారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.