నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు తీవ్రం అయ్యింది. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకూ వైసీపీ మూడు గ్రూపు..ఆరు తగాదాలుగా రోడ్డున పడుతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో సరిపడడంలేదు. ఇదే సీటు కోసం పోటీపడుతున్న వైసీపీ నేతలు కూడా అనిల్ కి దూరంగానే ఉంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సీటు ఆశిస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డిని సీఎం జగన్ మోహన్ రెడ్డి చేరదీస్తుండడంతో కోటంరెడ్డి అలకబూనారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి సందర్భం దొరికితే జగన్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఆనంకి చెక్ పెట్టడానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో వర్గపోరు మరింత తీవ్రమైంది. గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ కి టికెట్ ఇస్తే సహకరించేది లేదంటూ అసమ్మతివర్గం భీష్మించుకు కూర్చుంది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నేతల తీరుతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దోపిడీ, దౌర్జన్యాలను సొంత పార్టీ వారే అసహ్యించుకుంటున్నారు. ఓ రాజ్యసభ సభ్యుడు తన వారసుడిని ఇక్కడి నుంచి పోటీకి దింపాలని వైసీపీ పెద్దల వద్ద ప్రతిపాదన ఉంచారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆ రాజ్యసభ సభ్యుడి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఎన్నికలు వచ్చేనాటికి నియోజకవర్గాల్లో అసమ్మతి సద్దుమణగకపోతే వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
నిన్నటి వరకు బలంగా ఉన్న నెల్లూరులో, పతనం దిశగా వైసీపీ..
Advertisements