అశోక్‍గజపతిపై వైసిపి ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రామతీర్ధం ఘటనలో ఆయన పైన కేసు నమోదు చేసారు. అయితే కేసు పెట్టి ఒక్క రోజు గడవక ముందే సెక్షన్ 41ఏ కింద అశోక్‍గజపతి రాజుకి నోటిసులు ఇచ్చారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్ట్ కు రావాలని పోలీసులు అశోక్ గజపతిరాజుకు నోటీసుల్లో తెలిపారు. మరో పక్క, అశోక్ గజపతి రాజు, తమ పైన పెట్టిన అక్రమ కేసు పైన హైకోర్టులో పిటీషన్ వేసారు. కేసు కొట్టేయాలని కోరారు. అయితే ఈ కేసుని హైకోర్టు, సోమవారం విచారణ చేయనుంది. ఇక సంఘటన జరిగిన వివరాలు ఒకసారి చూస్తూ, రెండు రోజుల క్రిందట విజయనగరం రామతీర్థం బొడికొండపై తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ పునఃనిర్మాణానికి శంకుస్థాపనకు శిలాఫలకం పైన ఆలయ కమిటీ చైర్మన్‍గా ఉన్న అశోక్‍గజపతిరాజునుపేర లేక పోవడం పై అశోక్‍గజపతి రాజుకు , వైసిపి మంత్రి వెల్లంపల్లికు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కనీసం శంకుస్థాపనలో ప్రొటోకాల్ బోర్డుపై కూడా తన పేరు కనిపించ లేదని ఆయన తప్పు బట్టారు, ప్రొటోకాల్ ప్రకారం బోర్డుపై తన పేరు లేదని అశోక్ గజపతిరాజు దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వారి మధ్య తీవ్ర తోపులాట జరిగింది .ఈ తోపులాటలో అశోక్‍గజపతిరాజు అస్వస్థతకు గురిఅవ్వటంతో అక్కడ కొద్ది సేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లోనే శంకుస్థాపనను,మంత్రులు బొత్స, వెల్లంపల్లి పూర్తి చేసారు. మంత్రి వెల్లంపల్లి కనీసం కొబ్బరికాయ కూడా కొట్ట నివ్వలేదని అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రభుత్వం కార్యక్రమం కాదని, 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు నిర్మించిన ఆలయం ఇది అని, ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీని వీళ్ళు కాలరాసారని, దీని గురించి ఆలయ ధర్మకర్తగా ఈవోకి నా అభిప్రాయం చెప్పానని ఆయన మీడియాతో చెప్పారు. తనకు కనీస మర్యాద ఇవ్వలేడం లేదని, ఆలయం కోసం విరాళంగా ఇచ్చిన నా చెక్కు స్వీకరించలేదని, కావాలనే వైసిపి రాజకీయం చేస్తున్నారని, ఈ రాష్ట్రంలో న్యాయం ఉందా అనే అనుమానం కలుగుతోందని, ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని, ఈ ప్రభుత్వం ఆధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తుందని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటన పైన, అనూహ్యంగా అశోక్ గజపతి రాజు గారి పైన కేసు పెట్టటం, నోటీసులు ఇవ్వటం జరిగింది.