ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు గురించి అందరికీ తెలిసిందే. అన్ని రూల్స్ బ్రేక్ చేస్తూ, ఏపి ప్రభుత్వం చేస్తున్న అప్పుల పై, కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. గత రెండేళ్ళ కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎఫ్ఆర్బీఎం పరిమితి, అంటే కేంద్ర ఆర్ధిక శాఖ, రాష్ట్రాలకు మధ్య జరిగిన ఒప్పందాలు చూసుకుంటే, దాన్ని దాటి, ఏపి ప్రభుత్వం దాదపుగా రూ.17,924 కోట్ల వరకు, ఎక్కువగా అప్పులు చేసిందని కేంద్రం తేల్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తన అప్పు పరిమితికి మించి రూ.17,924 కోట్ల వరకు ఎక్కువగా ఇప్పటి వరకు అప్పు చేసినట్టు కేంద్రం చెప్పింది. లోకసభలో, రాష్ట్రానికి చెందిన ఎంపీలు అయిన, తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, అదే విధంగా వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఇరువురూ అడిగిన ప్రశ్నలకు, కేంద్రం ఆర్ధిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితులు , ఇవన్నీ అంచనా వేసుకుని, జీడీపీలో, 4శాతం వరకు అప్పులు చేసుకోవటానికి నిర్ణయం తీసుకోబడిందని, దీని ప్రకారమే అప్పులు చేయాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, వీటి అన్నిటికీ మించి అప్పులు చేసింది కాబట్టి, రాబోయే మూడేళ్ళలో చేసే అప్పుల్లో, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటకుండా, అప్పులు చేయకుండా, పరిమితి విధిస్తామని చెప్పింది.
అదే విధంగా, ఇప్పుడు చేసిన రూ.17,924 కోట్ల అధిక అప్పుని, వచ్చే మూడేళ్ళలో సర్దుబాటు చేస్తామని షాక్ ఇచ్చింది. అంటే వచ్చే మూడేళ్ళలో తీసుకునే రుణాలను, ఈ రూ.17,924 కోట్లలో మినాయిస్తారు. ఆర్దిక పరమైన విషయాలు అన్నీ, రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించి, ఆర్ధిక పరమైన క్రమశిక్షణ పాటించాలని ఆశిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాకుండా, ఇలా ఏ రాష్ట్రం చేసినా, వారికి కూడా ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పులను తమ పరిధికి లోబడే తీసుకోవాల్సి ఉంటుందని, కేంద్రం స్పష్టం చేసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు విషయంలో, ఇంకా ఎన్ని ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో అని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వచ్చే ప్రభుత్వాలకు పెద్ద గుడిబండ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడే పరిమితులు విధించి, రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.