స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పట్లో ఎండీగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమ్ చంద్రారెడ్డికి, అదే విధంగా అప్పట్లో ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన పీవీ రమేష్, ఇద్దరికీ కూడా ఈ రోజు సిఐడి నోటీసులు జారీ చేసింది. వీళ్ళకు సిఆర్పీసిలోని సెక్షన్ 160, అంటే సాక్షిగా, అలాగే సెక్షన్ 91, అంటే డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే సమర్పించాలని వీళ్ళకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఇందులో ప్రేమ్ చంద్రారెడ్డికి మొత్తం, 37 ప్రశ్నలను సంధిస్తూ, సిఐడి నోటీసులు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి, ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసారని, నిధులు విడుదల చేయటం వంటి వాటి పైన ప్రశ్నించారు. ఆ నాడు ఈ ఫైల్ పైన, నిధులు విడుదల చేసే సమయంలో, ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి సంతకాలు లేకుండా, నోట్ ఫైల్ ఎలా సర్క్యులేట్ అయ్యింది అనే విషయం కూడా ప్రశ్నించారు. క్యాబినెట్ నిర్ణయం తరువాత ఈ ఫైల్ వెళ్ళిందని చెప్పినా, సంతకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. దీంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ఆర్ధిక మంత్రి యనమల, అప్పటి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు, వీరి ముగ్గిరి పాత్ర పైన కూడా ప్రశ్నలు సంధించారు. అదే విధంగా ఈ ఫైల్ వెళ్ళిన విధానంలో, అనేక లోపాలు ఉన్నాయని, అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు ఇచ్చిన ఆదేశాలు ఏమిటో చెప్పాలని కూడా కోరారు. దీంతో పాటుగా, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన పీవీ రమేష్, ఎవరి దగ్గర నుంచి ఆదేశాలు తీసుకున్నారని ఆయనకు కూడా ప్రశ్నలు సందించారు. అప్పటి ఆర్ధిక మంత్రి యనమల పాత్ర, ఈ అంశంలో ఆయన పాత్ర ఏమిటో చెప్పాలని కోరారు. వీటికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఇవ్వాలని కోరారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి, కేవలం సాక్షిగానే వారిని పిలిచినట్టు సిఐడి చెప్తుంది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం గమనించాల్సి ఉంటుంది. ఇంత ప్రాధాన పాత్ర ఉన్న అధికారులకు ఏమో నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పమని, లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావు లాంటి వాళ్ళ విషయంలో, వాళ్ళ పాత్ర నిధుల విడుదలలో ఏమి లేకపోయినా, వారిని మాత్రం ఎందుకు డైరెక్ట్ గా వెళ్లి , గందరగోళం సృష్టించి అరెస్ట్ చేసారు అనే విషయం పైన మాత్రం, సిఐడి పైన విమర్శలు వస్తున్నాయి. వీరి వద్ద నుంచి కూడా ఇలాగే నోటీసులు ఇచ్చి సమాధానాలు తీసుకోవచ్చు కదా ?