ఆర్ధిక కష్టాల్లో ఉన్న జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎక్కడ డబ్బులు అంటే అక్కడ తీసి వాడేస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మన దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు డబ్బులు చెల్లించకపోవటం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ముఖ్యంగా సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు జూన్ నెల డబ్బులు, ఇప్పటికీ ఇవ్వకపోవటం పై కోర్టు ఆదేశాలు ఇస్తూ, ఈ నెల 29 లోపు వారికి డబ్బులు చెల్లించాల్సిందే అని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వం తమకు జనవరి 15 వరకు సమయం కావాలని కోరగా, అందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. తమ ఆదేశాలు పాటించాల్సిందే అని, మేము చెప్పిన సమయం లోపు బకాయలు తీర్చక పొతే, కోర్టు ధిక్కరణ కేసు ఓపెన్ చేయాల్సి ఉంటుందని, అలాగే విద్యుత్ శాఖ ముఖ్య అధికారులను కూడా కోర్టుకు రాప్పించాల్సి ఉంటుందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక పక్క ప్రజల నుంచి ప్రతి నెల కరెంటు బిల్లులు వసూలు చేస్తూ, విద్యుతు ఉత్పత్తి సంస్థలకు డబ్బులు చెల్లించక పోతే ఎలా అంటూ, కోర్టు ఆగ్రహించింది. తాము ప్రతి త్రైమాసికానికి పేమెంట్లు చేయాలని కోరుతుంటే, మీరు మాత్రం, నెలకు విభజించి, నెల వారీగా చెల్లింపులు చేస్తామని ఎలా చెప్తారని, ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది.
గత రెండు క్వార్టర్ లకు సంబంధించి, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎప్పటి లోగా చెల్లింపులు చేస్తారు అనేది, తమకు అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఒక పక్క వినియోగదారుల దగ్గర బిల్లులు వసూలు చేస్తూ, మరో పక్క సంస్థలకు మాత్రం బకాయిలు పెట్టటం సరి కాదు అంటూ, కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుని ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ముందుకు వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పీపీఏలను సమీక్ష చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై, సింగల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, సింగెల్ బెంచ్ తీర్పు పై హైకోర్టు డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించాయి సోలార్, విండ్ కంపనీలు. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఇరు పక్షాలు హోరాహరీ వాదనలు వినిపించాయి. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ, నిధులు మళ్ళించాం అని చెప్పటం కరెక్ట్ కాదని, తమకు కొంత సమయం కావాలని కోరగా, కోర్టు మాత్రం 29కే చెల్లించాలని, లేకపోతే కోర్ట్ ధిక్కరణ కింద పరిగణిస్తాం అని ఆదేశాలు ఇచ్చింది.