అప్పులు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఏది ఏమైనా అప్పులు చేయటం, స్వాహా చేయటమే పనిగా పెట్టుకుంది. ముందుగా ఆర్‌బీఐ నుంచి అప్పులు తేవటం మొదలు పెట్టారు. ఏడాదికి ఇచ్చిన అప్పులు లిమిట్ ను, కేవలం నాలుగు నెలల్లో లాగేసారు. ఆర్‌బీఐ అప్పులు ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్పటంతో, కేంద్రంతో తంటాలు పడి అప్పులు పెంచుకున్నారు. రెండు నెలల్లో ఇదీ లాగేశారు. మద్యం ఆదాయం పై అప్పులు తెచ్చారు. అనేక బకాయలు బాకీ పడ్డాయి. ఇలా విచ్చల విడిగా అప్పులు చేస్తూ, ఏమైనా చేస్తున్నారా అంటే, అభివృద్ధి అనే మాటే రాష్ట్రంలో లేకుండా పోయింది. ఇక ఇప్పుడు చివరకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి డబ్బులు లాగేసే కార్యక్రమం మొదలు పెట్టారు. దీని కోసం ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టారు. అదే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్. అనేక ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, ఇలా ఏది పడితే అది, వాళ్ళు దగ్గర ఉన్న డిపాజిట్లు అన్నీ ఈ ఎకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశాలు వెళ్ళాయి. కొంత మంది మనకు ఎందుకులే అని వెంటనే బదిలీ చేసారు. కొంత మంది ఎదురు తిరిగారు. వారి పైన నేరుగా చీఫ్ సెక్రటరీ ఒత్తిడి చేయటంతో, ఇక చేసేది ఏమి లేక వారు కూడా ఇచ్చేసారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి, 400 కోట్లు కొట్టేయటం, తాజా ఉదాహరణ.
అయితే ఈ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పై, ఆర్‌బీఐకు ఆరా వచ్చింది. వెంటనే ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. అసలు ఈ కార్పొరేషన్ ఏమిటి ? దానికి ఎవరు బాధ్యులు ? వాళ్ళు ఏమి చేస్తారు ? ఇలా రకరకాలుగా తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖలు రాసింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ఏకంగా మూడు సార్లు రాసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన రిప్లై ఇవ్వలేదు. ఆర్‌బీఐకి చిక్కకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్ర విచిత్రాలు చేస్తుంది. మొత్తం ఈ కార్పొరేషన్ ఆడిట్ ఇవ్వాలని ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో , ఆ శాఖలకు సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు ఉంటాయి. ఆ బ్యాంక్ డిపాజిట్లు అన్నీ వివిధ శాఖల నుంచి తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్ అనే కంపెనీ పెట్టి, అందులోకి నిధులు మొత్తం పోగేసి, అక్కడ నుంచి తన అవసరాలు కోసం వాడుకుంటుంది. అప్పులు పుట్టక పోవటంతో, ఇలాంటి విన్యాసాలు చేస్తుంది.