ఈ వారం రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, చేసిన తప్పులు అన్నీ వెనక్కు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు, మళ్ళీ పెడతాం అని చెప్పినా, అది అయ్యే పని కాదు. ఇక శాసనమండలి రద్దు బిల్లు వెనక్కు తీసుకున్నారు, ఇలా పెద్ద పెద్ద నిర్ణయాలు వెనక్కు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆపేసిన కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో, మళ్ళీ ముందుకు వెళ్ళాలని జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఆదేశించారు. నిన్న జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా నిన్న, మెడికల్ కాలేజీల అంశాలకు సంబంధించి, తమ నియోజకవర్గాల్లో మేడికల్ కాలేజీలు లేవు అని చెప్పటం, ఇదే సందర్భంలో కొంత మంది అధికారులు తమిళనాడులో మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయని చెప్పటంతో, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాల్సి ఉందని, అధికారులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఈ నిధులు ఇస్తుందని చెప్పారు. అయితే ఇదే సమయంలో కొత్త జిల్లాల ప్రక్రియ ఏమి అయ్యింది అంటూ, కొంత మంది ఎంపీలు ప్రస్తావించటంతో, జగన్ మోహన్ రెడ్డి అప్పటికప్పుడే మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
వెంటనే కొత్త జిల్లాల ప్రక్రియ మొదలు పెట్టాలని, అక్కడున్న అధికారులకు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రస్తుతం జనగణ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, క-రో-నా కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని, రేపు జనవరి నుంచి జనగణన ప్రారంభం అవుతున్న సమయంలో, ఇప్పుడు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టేందుకు వీలు లేదని అధికారులు చెప్పారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ప్రాధమిక స్థాయిలో పూర్తి చేయాల్సిన ప్రక్రియ మొదలు పెట్టాలని కోరారు. సరిహద్దుల విభజన, ఆస్తులు విభజన, అదే విధంగా ప్రజాభిప్రాయ సేకరణ, ఈ తంతు మొత్తం పూర్తి చేస్తే, జనగణ పూర్తయ్యే నాటికి, మనం మొత్తం సిద్ధంగా ఉంటే , అప్పుడు ఒకేసారి కొత్త జిల్లా ప్రక్రియ తొందరగా మొదలు పెట్టి, చట్టబద్ధత ఇచ్చి, గజిట్ నోటిఫికేషన్ తీసుకుని వెంటనే అమలు చేయవచ్చు అని సూచించారు. దీనికి సంబంధించి, వచ్చే వారం, దీని పైన ఒక మీటింగ్ పెట్టి, ఇప్పటి వరకు ఏమి జరిగింది, భవిష్యత్తులో ఏమి చేద్దాం అనే అంశం పై రోడ్ మ్యాప్ రెడీ చేయాలని, అప్పటికప్పుడు ఆదేశించారు.