అమరావతి భూముల్ని తాకట్టు పెట్టి, వేల కోట్లు అప్పులు పొంది, ఆ సొమ్ముని దిగమింగే క్రమంలోనే అమరావతి మున్సిపల్ క్యాపిటల్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి, దాని పరిధిలోకి 29గ్రామాలను కాకుండా, కేవలం 19గ్రామాలనే ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ వ్యవహారమంతా కూడా రాజధాని రైతుల్ని మరింత మానసిక క్షోభకు గురిచేయడానికేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని టీడీపీ జాతీయకార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని 19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ అని కొత్తపేరు పెట్టారు. దాన్ని 19 గ్రామాలకు పరిమితం చేసి, రాజధానిలోనే ఉన్న 10 గ్రామాల్ని గాలికి వదిలేశారు. కేవలం తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలో 3 గ్రామాలు తీసుకొని.. తాడేపల్లి మండలంలోని 2 గ్రామాలు మంగళగిరి మండలంలోని 4 గ్రామాలు, మరికొన్ని గ్రామాలను పక్కన పెట్టారు. కేవలం రాజధానిని డైల్యూట్ చేయాలన్న దురాలోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం అన్ని గ్రామాల రైతులు భూములిచ్చారు. ఎక్కడైనాసరే, ఎవరైనా సరే రైతులు బువ్వపెడితేనే అందరం తినే పరిస్థితి ఉంది. అలాంటి రైతుల్ని మానసికక్షోభకు గురిచేస్తూ, ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. రాజధానిలో ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, న్యాయస్థానాల అనుమతి తప్పనిసరని హైకోర్ట్ స్పష్టంగా చెప్పింది. దానికి సంబంధించి రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన స్టేటస్ కో ఇప్పటికీ అమల్లో ఉంది. దాన్నిధిక్కరించేలా ప్రభుత్వం ఇప్పుడు 29 గ్రామాలను కాదని, 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ కు శ్రీకారం చుట్టింది. రైతులు ఇచ్చిన భూముల్లో దాదాపు 481 ఎకరాలు, రూ.3,760కోట్లకు పైగా విలువ చేస్తుందని, ఆ భూముల తాకట్టుతో రూ.2,994కోట్లు అప్పు తీసుకోవాలని చూస్తున్నారు. ఆక్రమంలో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు కూడా.
481 ఎకరాలు రూ.3,760 కోట్లు అయితే, ఒక్కో ఎకరా దాదాపు రూ.7 కోట్లపైన పలుకుతోంది. అమరావతిని గురించి గతంలో పెద్దపెద్ద మంత్రులు, లావు మంత్రులంతా శ్మశానమని, ఎడారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. అదే మంత్రులు, అదేప్రభుత్వం బ్యాంకులకు తాకట్టుపెట్టడానికి తయారు చేసిన డీపీఆర్ లో ఎకరం భూమి విలువ రూ.7 కోట్లని చెప్పారు. ఆ లెక్కన చూసినా, మొత్తం రాజధాని రైతులిచ్చిన 34 వేల ఎకరాల విలువ రూ.2లక్షల38 వేల కోట్లు అవుతుంది. బ్యాంకుల్లో తీసుకున రుణానికి సంబంధించి మొదటి రెండేళ్లు మారటోరియం అప్పుని 481ఎకరాలు అమ్మి తీరుస్తామని చెబుతున్నారు. తరువాత తీసుకునే అప్పులను 18 సంవత్సరాల వరకు దఫదఫాలుగా వాయిదాలు చెల్లిస్తామని, అప్పటికి భూమివిలువ ఎకరా రూ.17 కోట్ల 70లక్షలు అవుతుందంటున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, ప్రధాన మంత్రి మాటల నమ్మి రైతులు 34వేలఎకరాలు ఇచ్చారు. దానివిలువ రూ.2లక్షల38వేల కోట్లను బ్యాంకుకి చూపించి అప్పులు తీసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే అమరావతి మున్సిపల్ కేపిటల్ కార్పొరేషన్ ఆవిర్భావం జరిగింది. అంతిమంగా అప్పులు తీసుకొని రైతుల గొంతుకోయాలి. ఇదేగా ప్రభుత్వఆలోచన. అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఆ భూములను మీరు బ్యాంకుల్లో పెట్టి రుణాలెలా తీసుకుంటారు? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? టీడీపీ ప్రభుత్వంలో అప్పులు ఇవ్వవద్దని ఇప్పుడున్న మీరే నాబార్డ్ వంటి సంస్థలకు లేఖలు రాశారు. మరి మీరే ఇప్పుడు ఊళ్లో వాళ్ల ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. ముందు అమరావతిలో చేయాల్సిన అభివృద్ధి చేయండి. భూములిచ్చినవారికి న్యాయం చేయకుండా ఆ భూములు బ్యాంకుల్లో ఎలా తాకట్టు పెడతారు?