దశలవారీ మద్యపాన నిషేధం ముసుగులో జగన్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలు జరుపుతూ, మద్యంవ్యాపారాన్నేప్రధాన ఆదాయవనరుగా మార్చుకొని, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రాణాలకు హానికలిగించే పలురకాల కల్తీ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో విక్రయిస్తూ, తాడేపల్లిలో ఇండెంట్ – హైదరాబాద్ లో పేమేంట్ అన్నతీరుగా జే-ట్యాక్స్ కోసం జగన్ వ్యవహారం నడిపిస్తున్నాడన్నారు. నెలకు రూ.350కోట్ల పైచిలుకు చొప్పున కమీషన్లు కొట్టేస్తూ, 10నెలల నుంచి జే-ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారన్నారు. మద్యపానం నిషేధం కోసమే ధరలు పెంచామని, దానివల్ల మద్యం వినియోగం తగ్గుతుందని చెబుతున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడా కనీవినీ ఎరుగని, ఎవరూ చూడని, పిచ్చిపిచ్చిపేర్లతో చెలామణి అవుతున్న మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలకు సరఫరా చేస్తున్నారన్నారు. జార్డీ ఎస్ బార్ (విస్కీ), బూమ్ (బీర్), వంటి పేర్లున్న వివిధరకాల కల్తీ మద్యాన్ని కమీషన్ల కోసమే విక్రయిస్తున్నారని ఉమా తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతో సహా, జగన్ కు ఇష్టమైన దక్షిణాఫ్రికాలో కూడా లభించని మద్యం బ్రాండ్లన్నీ, ఏపీలోనే జగన్ సర్కారు అమ్ముతోంద న్నారు. బీర్ కేసుకి ఇంత, చీప్ లిక్కర్ కు ఇంత, లిక్కర్ కు ఇంతా అని లెక్కలేసి మరీ జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా కమీషన్లు వసూలు చేస్తోందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో 50, 60ఏళ్ల నుంచి మద్యం ఉత్పత్తులు తయారుచేస్తున్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లనే విక్రయించడం జరిగిందన్నారు. జనం ఆరోగ్యంతో చెలగాటమాడేలా జగన్ మాదిరి పిచ్చి మద్యం అమ్మలేదన్నారు. డబ్బుపిచ్చి పట్టిన జగన్ ప్రభుత్వం, పొద్దస్తమానం కష్టపడిన శ్రమజీవి రక్తాన్ని, మద్యం అమ్మకాల ద్వారా పీల్చడానికి కూడా వెనుకాడటం లేదని బొండా మండిపడ్డారు. హైదారాబాద్ లో జే-ట్యాక్స్ కట్టిన బ్రాండ్లకు మాత్రమే తాడేపల్లిలో ఇండెంట్ ఇస్తున్నారని, గతంలో ఎప్పుడూ చూడని, వినని పేర్లతో కూడిన డిస్టిలరీలన్నీ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. తొలి రెండునెలలు డిస్టిలరీలు ఇచ్చిన కమీషన్లతోనే సర్కారు తృప్తిపడిందని, కానీ తరువాత సొంతంగా నడపాలన్న ఆలోచనతో పక్కరాష్ట్రాల నుంచి పిచ్చిపిచ్చిపేర్లతో కల్తీమద్యం విక్రయాలు జరపడానికి సిద్ధపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో, మద్యం సిండికేట్ల వ్యవహారం భారీ ఎత్తున సాగుతున్న ఉదంతాలనుచూశామని, బొత్స లాంటి ప్రముఖుల పేర్లుకూడా ప్రచారంలోకి వచ్చాయన్నారు. వైసీపీప్రభుత్వం లోని కీలకనేతలంతా కలిసి, జగన్ అండదండలతో ఏపీలో అతిపెద్ద లిక్కర్ మాఫియాకు తెరలేపారన్నారు. టీడీపీ ప్రభుత్వం విక్రయించిన మద్యం రకాలన్నీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖమైనవని, జగన్ ప్రభుత్వం విక్రయించే బ్రాండ్లు మాత్రం ఏపీలో తప్ప ఇంకెక్కడా లభించడంలేదన్నారు. (కల్తీ మద్యంరకాలను బొండా ఉమా ఈ సందర్భంగా విలేకరులకు చూపించారు), ప్రతిరోజు కొన్ని లక్షలలీటర్ల కల్తీ మద్యం రాష్ట్రంలోనే తయారవుతోందని, దానికితోడు అదనంగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చిన ఎన్ డీపీ లిక్కర్ (నాన్ డ్యూటీపెయిడ్)ను రాత్రి 8.30గంటల నుంచి వైసీపీనేతలే విక్రయిస్తున్నారన్నారు.

వాలంటర్లీ ద్వారా పింఛన్లు ఇంటింటికీ ఇప్పించామని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం, వారిద్వారానే గడపగడపకూ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోందన్నారు. రూ. 500 నుంచి రూ.700 సంపాదించే దినసరి కూలీ, మద్యానికి రూ.200 ఖర్చుచేసేవాడని, ఇప్పుడు పిచ్చిమందు కొనడానికి రూ.400వరకు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మందు తాగేవారంతా, రాత్రివేళల్లో వింతవింతగా ప్రవర్తిస్తూ ఇంట్లోనివారికి కూడా నిద్రలేకుండా చేస్తున్నారని, ఉదయం ఎన్నిగంటలకు లేస్తారో కూడా తెలియడంలేదని, దీనికంతటికీ జగన్ కు పట్టిన డబ్బుపిచ్చే కారణమన్నారు. తన డబ్బుపిచ్చి కారణంగా ప్రజల ప్రాణాలను హరించడానికి కూడా జగన్ వెనుకాడటంలేదని ఉమా దుయ్యబట్టారు. రాష్ట్రంలో తయారవుతున్న కల్తీమద్యం వల్ల తమకు ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని మద్యపానప్రియులే చెబుతున్నారన్నారు. కేస్ ల వారీగా చీప్ లిక్కర్ పై రూ.3వేలు, బీర్ ల కేస్ పై రూ.700, ప్రీమియం బ్రాండ్లపై కేస్ కు రూ.4నుంచి రూ.5వేల వరకు ధరలు పెంచి అమ్ముతూ, జే-ట్యాక్స్ వసూలుచేస్తున్నారన్నారు. మద్యనిషేధం అమల్లో ఉంటే, ప్రభుత్వానికి ఆదాయం తగ్గాలని, కానీ అందుకు విరుద్ధంగా జగన్ కు, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో, పేదలు, కార్మికులు, రోజువారీ కూలీల జేబుకు చిల్లుపడిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కల్తీ మద్యం కారణంగా ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్యకూడా పెరిగిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే, నిజంగా సంపూర్ణ మద్య నిషేధం అమలుచేయాలన్నారు.

జగన్ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఉల్లిపాయలకోసం, మగవాళ్లు మద్యం కోసం క్యూలైన్లలో నిలబడే పరిస్థితి ఏర్పడిందన్నారు. పిచ్చి మద్యం తాగేవారంతా, తామేం చేస్తున్నామో తెలియని స్థితిలో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యం తరలింపు కాంట్రాక్ట్ కూడా వైసీపీనేతలే కొనసాగిస్తున్నారని, దానిద్వారా కూడా ప్రభుత్వం దోపిడీ సాగిస్తోందన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం నిబంధనలప్రకారం మద్యం దుకాణాలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదని, అందుకు విరుద్ధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేలా పాఠశాలలు, గుడులు, మసీదులు, చర్చిలు, ఇళ్లమధ్యనే దుకాణాలు నిర్వహిస్తున్నారని ఉమా స్పష్టంచేశారు. రాష్ట్రంలో కొత్తమద్యం పాలసీ వచ్చాక, దాదాపు 8లక్షల పైచిలుకు మద్యం కేసులు విక్రయించారని, వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి కూడా 40 నుంచి 50శాతం వరకు కమీషన్లు దండుకుంటున్నారని ఉమా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అడిగే కమీషన్లు డబ్బురూపంలో చెల్లించలేమంటూ ప్రధాన కంపెనీలన్నీ ఇప్పటికే చేతులెత్తేశాయన్నారు. దానివల్లే ప్రధాన కంపెనీల మద్యం అందుబాటులో లేకుండా పోయిందని, కమీషన్లు ఎక్కువిచ్చే జగన్ బ్రాండ్లు మాత్రమే విచ్చలవిడిగా లభిస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి ఎవరు ఎక్కువలంచం ఇస్తే, వారి బ్రాండ్లనే అమ్ముతున్నారని ఉమా తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సంపూర్ణ మద్యపాని నిషేధాన్ని అమలుచేసి, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మద్యాన్ని నిషేధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే, పిచ్చిపిచ్చి బ్రాండ్లను విక్రయానికి పెట్టేదికాదని, ఆ ఆలోచన లేకపోబట్టే, దశలవారీగా మద్యం దుకాణాలను ఆదాయవనరుగా మార్చిందన్నారు. తెలంగాణలో ఏఏ రకాలు అమ్ముతున్నారో, ఏపీలో ఏరకమైన మద్యం అమ్ముతున్నారో, ఎందుకు అమ్ముతున్నారో జగన్ సమాధానం చెప్పాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read