రాష్ట్రప్రభుత్వం బీసీలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో ఆయా వర్గాలకు అన్యాయం చేయడానికి జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థానికసంస్థల్లో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, నేడున్న వైసీపీప్రభుత్వం కావాలనే ఆ మొత్తాన్ని తగ్గించడా నికి యత్నిస్తోందన్నారు. 59శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన జగన్, నేడు కావాలనే తనపార్టీ వారిని కోర్టులకు పంపి, వాటిని 50శాతానికి కుదించేయత్నాలు చేస్తున్నాడన్నారు. వైసీపీకి చెందిన బోయ రామాంజనేయులుని (రాఫ్తాడు మండల వైసీపీ కన్వీనర్) కోర్టుకి పంపిన జగన్ సర్కారు, హైకోర్టులో కూడా బీసీలకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించడంలో విఫలమైందన్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగేలా కోర్టు తీర్పురావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని రవీంద్ర దుయ్యబట్టారు.
రాజధాని విషయంలో తన పంతం నెగ్గించుకోవడానికి రూ.5కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి న్యాయవాదిని నియమించిన జగన్మోహన్ రెడ్డి, బీసీల రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనకోసం, అనుభవజ్ఙుడైన న్యాయవాదిని ఎందుకు నియమించలేదన్నారు. బీసీలకోసం కనీసం రూ.కోటికూడా ఖర్చుచేయకపోవడంవల్లే, బలహీనవర్గాలవారు తమహక్కులు కోల్పోయే దుస్థితి దాపురించిందన్నారు. జగన్ ప్రభుత్వం హైకోర్టులో సరిగా వాదనలు వినిపించలేకపోయినందునే, రిజర్వేషన్లు 55శాతానికి పరిమితం చేయబడ్డాయని, దానివల్ల బీసీలు దాదాపు 10శాతం స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 59శాతం రిజర్వేషన్లు అమలై ఉంటే, బీసీలకు 39శాతం వరకు రిజర్వేషన్లు దక్కేవన్నారు. వైసీపీప్రభుత్వం వచ్చాక బీసీలకు చిల్లిగవ్వ కూడా ఖర్చుపెట్టకపోగా, స్థానికసంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సిన రిజర్వేషన్లకు కూడా కోతపెట్టిందన్నారు. గతప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకోసం అమలుచేసిన అనేక సంక్షేమపథకాలను జగన్ రద్దుచేశాడన్నారు.
కోర్టు తీర్పు ప్రకారం బీసీలకు 25శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతాయని, తద్వారా 1200 గ్రామపంచాయతీలు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. బలహీనవర్గాలకు అన్యాయం జరగుతున్న నేపథ్యంలో మంచిలాయర్ ద్వారా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కార్పొరేషన్ పదవుల్లో బీసీలకు అన్యాయంచేసిన జగన్ ప్రభుత్వం, తాజాగా రిజర్వేషన్ల అంశంలోకూడా వారికి తీరని అన్యాయం చేయడానికి సిద్ధమైందని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
బడుగు, బలహీన వర్గాలకు మేలుకలిగేలా 59శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, తన పార్టీకే చెందిన వ్యక్తితో రిజర్వేషన్ల అంశాన్ని కోర్టులో వేయించి, బీసీలకు 10శాతం వరకు రిజర్వేషన్లు తగ్గేలా చేసిందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టంచేశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గినా జగన్ సర్కారులో చలనంలేదని, బీసీలు తమప్రభుత్వానికి బ్యాక్ బోన్ అని చెబుతూనే, వారి వెన్నువిరిచే కార్యక్రమాన్ని యథేచ్ఛగా సాగిస్తోందన్నారు. జగన్ కు నిజంగా బీసీలపై ప్రేమాభిమానాలుంటే, ఇప్పటికైనా సుప్రీంకోర్టు తలుపుతట్టి, వారికి న్యాయంజరిగేలా చూడాలని అర్జునుడు డిమాండ్ చేశారు.
అవసరమైతే రూ.2కోట్లు ఖర్చుపెట్టైనా సరే, సుప్రీంలో న్యాయవాదిని నియమించి బీసీలకు న్యాయం జరిగేలాచూడాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందన్నారు. ఎన్టీ ఆర్ బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తే, చంద్రబాబునాయుడు వారిని ఆర్థికంగా పరిపుష్టులను చేశాడన్నారు. రాజ్యాధికారంలో బడుగు, బలహీనవర్గాలకు సరిపడా రిజర్వేషన్లు కల్పించలేనప్పుడు, వారికి జగన్ హామీలెందుకిచ్చాడో చెప్పాలన్నారు. రాష్ట్ర జనాభాలో దాదాపు 70శాతం వరకు బడుగు, బలహీనవర్గాలకు జగన్ ప్రభుత్వం 9నెలల్లో పైసా కూడా ఖర్చుచేయలేదని, ఏపీలో 139 వరకు బీసీకులాలుంటే కేవలం రెండు కులాలకే ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రభుత్వమిస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, రిజర్వేషన్ల అంశంలో కూడా వారికి నష్టం చేయాలని చూస్తే సహించేది లేదని అచ్చెన్న హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకటించగానే, దానిపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వ్యక్తి పూర్వాపరాలేమిటో మంత్రి బొత్స, ఇతర మంత్రులు తెలుసుకోవాలన్నారు. సదరు వ్యక్తి వైసీపీలో అతిముఖ్యమైన వాడని, ఆయనకు జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.