మూడు రాజధానుల ఏర్పాటుకు ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుండగా దీనికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం సరికొత్త అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో మరో పాచికను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులపై అధికారపక్షాన్ని ఇరుకుపెట్టిన తెదేపా, ఇప్పుడు తాజాగా గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. గత సమావేశాల్లో మాదిరిగానే ఈసారి కూడా జగన్ సర్కారుకు ఝలక్ ఇవ్వాలని భావిస్తోంది. తాజాగా సోమవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఈ మేరకు ఒక ప్రకటన చేసి, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. గత సమావేశాల్లోలాగా గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, ప్రతిపక్షాన్ని గౌరవించాలని లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుందని, ఈ ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగిస్తారని, అయితే ఈ ప్రసంగంలో మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు అంశాలను ప్రస్తావించవద్దని ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించామన్నారు. ప్రభుత్వం తమ మాటను గౌరవించకపోతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంటుందని, అప్పుడు సంక్షోభం తలెత్తుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఈ అంశంలో చిత్తశుద్ధి లేదని, కనీసం గవర్నర్ అయినా ఈ ప్రసంగాన్ని చదివే ముందు తిరస్కరణకు గురైన బిల్లుల అంశం ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అని సూచించారు. సాధారణంగా గవర్నర్ ప్రసంగాన్ని ఎక్కడా తిరస్కరించడం జరగదని, అయితే తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయ అవకాశం అంతకు మించి లేదని యనమల స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం తిరస్కరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టమంట కలుస్తుందని, అందుకే ఈ అంశంలో ప్రభుత్వం దిగి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అభివృద్ధి వికేంద్రీకరణ సీఆర్డీయే బిల్లులనురూల్-71 కింద శాసనమండలిలో తిరస్కరించామని, అయితే ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు వాటిపై చర్చ సాగించి ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసెంబ్లీ కార్యదర్శిని ప్రభుత్వం బెదిరించి సెలక్ట్ కమిటీ ఏర్పడకుండా ఆ ప్రక్రియకు అడ్డు పడుతోందని, ఈ నేపథ్యంలోనే తమతో పాటు మండలి చైర్మన్ షరీఫ్ క వాడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్నారు.
మండలిలో ప్రతిపక్ష పార్టీగా తమ హక్కులను ఎవరూ అడ్డుకోలేరని, ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే గతంలో ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని యనమల హెచ్చరించారు. మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దుపై ప్రభుత్వం క్షణాల్లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి, ఆమోద ముద్ర వేసి అరగంటలోనే శాసనసభలో ఆమోదించుకుందని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం అప్రజాస్వామికంగా జరగడంతో మండలిలో తాము అడ్డుకున్నామన్నారు. తమకు ఉన్న సంఖ్య బలంతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించామని, సెలక్ట్ కమిటీ ప్రక్రియను పూర్తి చేసి ఉంటే ఇప్పటికే సగం పని పూర్తి అయ్యేదని, ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరి వల్లే దీనికి విఘాతం కలిగిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనికి ప్రధాన కారణం జగన్ అని యనమల వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచ చరిత్రలో జగన్‌ను సరిపోల్చడానికి ఎవరూ లేరని, ఇండియాలో తుగ్లక్ మహాయుడు, జర్మనీలో హిట్లర్, ఇటరీలో ముసోలిన్, రోమ్ లో నీరో చక్రవర్తిని కలిపిన ఆయనకు సాటి రారని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యక్తిగత స్వార్థం ఉందని, స్వార్థం మినహా ప్రజల సంక్షేమం ఏ మాత్రం లేదని విమర్శించారు.