విజయవాడ పార్లమెంట్ పరిధిలో కరోనా వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎంపీ కేశినేని సూచించారు. వైరస్ నియంత్రణ కోసం తన ఎంపీ నిధుల నుంచి 5 కోట్లు విడుదల చేస్తానన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు చేసే వెంటనే పంపాలని కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లను ఆయన కోరారు. ఇక, కరోనాపై కట్టడి చేద్దాం ..అంతా కలిసి రావాలి..అంటూ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామమోహన్‌నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా పంజాతో విలవిల్లాడుతున్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా, శ్రీకాకుళం ఎంపీగా తన నియోజకవర్గంలో సాగుతున్న వైద్యసహాయకచర్యలకు తనవంతు సాయం అందిస్తానని ప్రకటించారు. ఒక నెల జీతంతోపాటు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 70 లక్షలు అందజేస్తున్నానని చెప్పారు.
ఈ నిధులు శ్రీకాకుళం కలెక్టర్‌కి అందజేయనున్నానని, శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇంకా వైద్యపరికరాలకు గానీ, ఏ అవసరం వచ్చినా తనకున్న నిధులన్నీ అందజేస్తానని తెలిపారు. స్వచ్ఛంద గృహనిర్బంధం ప్రకటించిన నేపథ్యంలో రోజువారీ కూలీలు ఒక్కరోజు కూలికెళ్లకపోతే భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. వారికి సాయంగా ఒక నెల జీతం అందజేస్తున్నానని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి కూడా ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరుతున్నానని చెప్పారు.