రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్లో ప్రస్తావించిన అంశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల నిర్వహణ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష కూడా నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనాను ఒక సాకుగా వాడుకున్నారని, నిజానికి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అవసరమని, ఎన్నికలు జరిగితేనే కరోనా వ్యాప్తిని కట్టడి చేసే చర్యలకు ఊతమిచ్చినట్టవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టును సైతం సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. అందుకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేయాలని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొబ్డే ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అయితే, ప్రభుత్వ పిటీషన్ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కెవియట్ పిటిషన్​ను సుప్రీంలో దాఖలు చేసింది. తమ వాదన కూడా వినాలని.. తరువాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్​లో కోరింది.

ఇక మరో పక్క, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ ప్రకటించడంపై హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కరోనా వైరస్ ప్రభావం దేశమంతటా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరిపించాలని కోరుతూ తాండవ యోగేష్, జనార్దన్ అనే వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరితో పాటు నెల్లూరుకు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాయిదా వేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

మరోవైపు కరోనా పేరుతో ఎన్నికలను వాయిదా వేశారని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం కూడా తీసుకోలేదని, కనుక ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ప్రభుత్వం వివరించింది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. మరో పక్క, స్థానిక సంస్థల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో వలంటీర్లను ఉపయోగిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వివరించారు. అయితే వలంటీర్లు ప్రచారం చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని పరిశీలించడం జరిగిందని, అలా చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సమగ్ర సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read