నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపులో కీలక మలుపు చోటు చేసుకుంది. మూడు రాజధానులపై ప్రభుత్వం ముందుకు పోతున్న సమయంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రక్రియకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎన్నికల సంఘం ఆరు వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేయడంతో పాటు ఎన్నికల కోడ్ ఈ ఆరు వారాలు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ మే నెల చివరి వరకు సాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని తరలింపుకి కోడ్ అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మే లో వేసవి సెలవులు ప్రారంభమై జూన్ లో పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం అవుతాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడం కూడా తరలింపుకి మరో అడ్డంకి కానుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు, మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. రాజధాని తరలింపు ప్రక్రియ జూన్ లోపు అయితేనే, సచివాలయ ఉద్యోగులు, పిల్లల అడ్మిషన్ లకు అవకాసం ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన రాజధాని అమరావతి ప్రాంత రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. రైతులు తమ వాదనను మరోసారి హైకోర్టుకు వినిపించనున్నారు. దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ప్ర తి ఒక్కరిలో నెలకొని ఉంది. వీటన్నిటికి తోడు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ఈ నెలలోనే ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు ప్రక్రియ దాదాపు ఏడాది వరకు సాధ్యం కాదన్న అభిప్రాయం విశ్లేషకులనుంచి వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఈ నెల 18వ తేదీన అమరావతిలో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగులనుంచి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం విశాఖకు రాజధాని తరలింపుకి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే వివిధ రాజకీయ పక్షాలు మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియ ఇప్పట్లో సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరో పక్క జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా చేసే పనులతో, ఇటు ప్రజలు, అటు ఉద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒక ప్రణాళిక లేకుండా, రూల్స్ ప్రకారం వెళ్ళకుండా, తనకు ఏది తోస్తే అది చేస్తే, ఇలాగే పర్యవసానాలు ఉంటాయని, ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి రూల్స్ ప్రకారం నడుచుకోవాలని అంటున్నారు.