రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, కరోనా ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, స్థానిక ఎన్నికలను వాయిదావేస్తే, దానిపై వితండవాదం చేసి, కులాలప్రస్తావన చేసి, రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచిన రాష్ట్రప్రభుత్వం, కమిషనర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు కు వెళ్లి, తీరని అవమానాన్ని మూటకట్టుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కూడాలెక్కచేయకుండా, ఎన్నికలే పరమావధిగా ముందుకెళ్లాని చూసిందన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది, ఎన్నికల కమిషన్ ఇష్టమనే విషయం చిన్నపిల్లాడికి కూడా తెలుసునని, ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి, భంగపడిందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీకి చెంపపెట్టు వంటిదన్న మాజీమంత్రి, ప్రభుత్వపెద్దలకు ఇంతకంటే అవమానం మరోటి ఉండబోదన్నారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికలను వాయిదావేస్తే, దానిపై ముఖ్యమంత్రి విపరీత వ్యాఖ్యానాలు చేశాడు. తనకు 150 స్థానాలున్నాయని, తాను ముఖ్యమంత్రినంటూ, ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) నిర్ణయంపై అక్కసు వెళ్లగక్కిన జగన్, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుని తప్పుపట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

అవగాహనలేని ముఖ్యమంత్రి ఉండటం వల్లే, రాష్ట్రానికి ఇన్ని అనర్థాలు దాపురిస్తున్నా యన్నారు. ఒక దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తయినా, రెండోదశలో మున్సిపల్, పంచాయతీలకు నామినేషన్లు వేసిన ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ, నామినేషన్లు ఉపసంహరించుకునేలా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. డబ్బు ఎరచూపుతూ నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని, ఈనేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, తిరిగి ఎన్నికల రీనోటిఫికేషన్ ఇవ్వాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాతైనా ముఖ్యమంత్రి కులభజన చేయడం మానుకొని, బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ప్రభుత్వం మానుకోవాలన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, యువత వివిధదేశాల్లో ఉన్నారని, కరోనా ప్రభావంతో ఆయా దేశాలన్నీ యూనివర్శీటీలను మూసివేసి, సమస్థలను మూసివేసి మనవిద్యార్థులను, స్వరాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విద్యార్థుల గురించి పట్టించుకోకుండా మంత్రులంతా, ముఖ్యమంత్రి భజనచేస్తున్నారని అచ్చెన్నాయు డు మండిపడ్డారు. ఎన్నికలు నిలిచిపోయాయి కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా కట్టడిపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రిగానీ, మంత్రులుగానీ, విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు, యువత ఆరోగ్యం దృష్ట్యా, ఏవిధమైన చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, కరోనా నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకున్నారో, రాష్ట్రంలో ఎంతమంది వైరస్ బారిన పడ్డారో, దాని ప్రభావానికి గురైనవారి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో, ప్రజలకు వివరించాలన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్ మరలా ఇచ్చి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తమపార్టీ తరుపున ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేయబోతున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి తన వితండవాదాన్ని మానుకొని, ప్రజానుగుణంగా పాలనసాగిస్తే మంచిదన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికలకమిషన్ కే సర్వాధికారాలుంటాయని, తాము కలుగచేసుకునేది లేదని సుప్రం ధర్మాసనం చెప్పిన తరువాతైనా, ముఖ్యమంత్రి తన తప్పు తెలుసుకొని, ఎస్ఈసీకి క్షమాపణలు చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ అంటే ఎన్నికల్లో గెలవడం.. ఓడటం మాత్రమే కాదని, ఎల్లప్పడూ ప్రజల గురించి ఆలోచిస్తూ, వారికోసం పనిచేసేదే నిజమైన రాజకీయపార్టీ అని, అటువంటి పార్టీ అధినేతగా ఉన్నచంద్రబాబు ఎన్నికలకు భయపడుతు న్నాడని, వైసీపీ చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం, పక్కరాష్ట్రాలనుంచి కూడా ఎవరూ రాకుండా నిరోధిస్తున్నారని, సినిమాహాళ్లు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వంటి వాటిని మూసేసిందని, రాష్ట్రప్రభుత్వ ప్రబుద్ధులు మాత్రం ఇప్పటివరకు అటువంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల కోడ్ తీసేయమన్నారనే సాకుతో, ప్రభుత్వం కొత్తపథకాలపేరుతో ప్రజల్ని మభ్యపెడుతుందని, దానితోపాటు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ నామినేషన్లు ఉపసంహరింపచేయడంపై, పార్టీ తరుపున కోర్టుని ఆశ్రయిస్తామన్నారు. జ్ఞానం ఉన్నవాడెవడూ కూడా రాష్ట్రమంత్రులు మాట్లాడినట్లుగా మాట్లారని, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా వేశారనే ఇంగితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు హర్షించరని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అన్ని వ్యవస్థలను, వ్యక్తులను మేనిప్లేట్ చేస్తున్న విజయసాయి, కరోనాను మాత్రం మేనిప్లేట్ చేయలేడన్నారు. కరోనాను మేనేజ్ చేయడం, వ్యవస్థలను, వ్యక్తులను మేనేజ్ చేసి, తప్పుడు లెక్కలతో డబ్బులు గడించినంత తేలిక కాదనే విషయాన్ని ఏ2 గ్రహిస్తే మంచిదన్నారు. కరోనా ప్రభావంతో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ, ఎన్నికలు వాయిదా వేయించుకుంటే, రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తప్పుపట్టి, కోర్టుకు వెళ్లడం ద్వారా తీరని అవమానాన్ని మిగుల్చుకుందన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం ఉండటం, ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని టీడీపీ నేత వాపోయారు. రాష్ట్రంలోని 2-3జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని, నామినేషన్లు వేయకుండా చేయడం, వేసినవారిని అడ్డుకోవడం, అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం వంటి చర్యలు జరిగాయంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టుకు వెళ్లిందని, అవసరమైతే, ఆజిల్లాలలో తిరిగి నోటిఫికేషన్ ఇస్తామని కూడా కమిషన్ చెప్పిందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచాతప్పకుండా అమలుచేయాల్సిన బాధ్యత సీ.ఎస్ పై ఉందని, అలాచేయకపోతే నేడుకాకపోతే రేపైనా సరే, ఆమే కోర్టులో నిలబడాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కొందరు అధికారులు, డీఎస్పీలు, ఎస్పీలు, ఐజీలను మార్చాలని ఈసీ ఆదేశించిన ప్రభుత్వం లెక్కచేయలేదని, దానికి సీ.ఎస్ బాధ్యత వహించి తీరాలన్నారు. సీ.ఎస్ వైఖరిపై రాష్ట్రపౌరుడిగా తాను కోర్టును ఆశ్రయిస్తానని, ఆమె తన పద్ధతి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని మాజీ మంత్రి హెచ్చరించారు. అత్యుత్సాహం చూపిన అధికారులపై మాత్రమే ఎన్నికల కమిషన్ చర్యలుతీసుకుందని, ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా సీ.ఎస్ తప్పుచేశారన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read