ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశం రోజుకి ఒక మలుపు తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే శాసనమండలి వ్యవహారం, ఏపిలో రాజ్యంగ సంక్షోభం దిశగా వెళ్తూ ఉండటంతో, మండలి చైర్మెన్ షరీఫ్, గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేసిన సంగాతి తెలిసిందే. శాసనమండలిలో ఉన్న సెక్రటరీ తన మాట వినటం లేదని, మండలి చైర్మెన్ గా ఉన్న తన హక్కులు హరిస్తున్నారు అంటూ, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఒత్తిడితో, సెక్రటరీ ఇష్టం వచ్చినట్టు ప్రవరిస్తున్నారని, సభ నిర్ణయం తీసుకుంటే, చైర్మెన్ ఆదేశాలు ఇస్తే, సుప్రీం కోర్ట్ కూడా జోక్యం చేసుకోదు అని, ప్రభుత్వం మాత్రం, కార్యదర్శితో, సభ తీసుకున్న నిర్ణయం అమలు కాకుండా చేస్తున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలో గవర్నర్ ఆదేశాలో, లేక ఎవరి ఒత్తిడి వల్లో కాని, శాసనమండలి వ్యవహారంలో అనూహ్య ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే కార్యదర్శి పై విమర్శలు వస్తున్న నేపధ్యంలో, శాసనమండలికి కొత్త సహయ కార్యదర్శిని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.
అసెంబ్లీలో సహాయ కార్యదర్శిగా పని చేస్తున్న విజయరాజును, శాసనమండలికి సంబంధించి లెజిస్లేషన్ బాధ్యతలు పర్యవేక్షించే సహాయ కార్యదర్శిగా అపాయింట్ చేస్తూ గురువారం ఉత్తర్వులు వచ్చాయి. ఇంతకు ముందు ఈ పొజిషన్ లో, ఉప కార్యదర్శి రాజకుమార్ ఉండేవారు. రాజకుమార్ స్థానంలో, విజయరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చైర్మెన్ షరీఫ్, తెలుగుదేశం ఎమ్మెల్సీలు, గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో, ఈ నియామకం, జరగటం, ఆసక్తికర చర్చకు దారి తీసింది. చైర్మెన్ షరీఫ్, గవర్నర్ ని కలిసి, మండలికి పూర్తి స్థాయి కార్యదర్శిగా విజయరాజును నియమించాలని కోరగా, ఇప్పుడు ఆయన్ను సహాయ కార్యదర్శిగా నియమించటం పై, పరిణామాలు ఎటు వైపు దారి తీస్తాయా అనే ఆసక్తి నెలకొంది.
ఈ మార్పు వల్ల, చైర్మన్కు మండలి వ్యవహారాల్లో కొంత వెసులుబాటు లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, శాసనమండలిలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో పాస్ అయిన రెండు బిల్లులు, శాసనమండలికి రావటం, శాసనమండలిలో నాటకీయ పరిణామాల నేపధ్యంలో, ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించాలి అంటూ, సభ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సెలెక్ట్ కమిటీ అంటే, వారు ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రభుత్వం అడ్డుకోక పోయి ఉంటే, ఈ పాటికి సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చేసి ఉండేది. అయితే, చైర్మెన్ సెలెక్ట్ కమిటీ ఉత్తర్వులు ఇవ్వమని చెప్పినా, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, ఆ ఫైల్ రెండు సార్లు తిప్పి పంపటంతో, చైర్మెన్ ఈ విషయం పై వెళ్లి, గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.