స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు వెలువడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పాలనాధికారులు గెజిట్‌లు విడుదల చేస్తున్నారు. పలు జిల్లాల కలెక్టర్లు పంపిన గెజిట్‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 10 జిల్లాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా 10 జిల్లాల్లో జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 11 జిల్లాల్లో ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామాలవారీగా రిజర్వేషన్ల వివరాలు sec.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగరపాలక రిజర్వేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి కాలేదు. రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పూర్తిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ అయిన తరువాత ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రెండోదశలో పురపాలక, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం లేదా రేపు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే, జడ్పీ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఇవాళ ఖారారు చేసారు. అయితే అంతా అనుకున్నట్టే, బీసీలకు దెబ్బ పడింది. 2013తో పోలిస్తే, 4 జిల్లాలకు బీసీల నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవి కోల్పోయే పరిస్థితి వచ్చింది. 2013లో, చిత్తూరు, కడప, కర్నూల్, నెల్లూరు జిల్లాలకు, బీసీలకు జడ్పీ ఛైర్‌పర్సన్ల స్థానం ఉండగా, ఇప్పుడు వారికి పోయాయి.
59 శాతం నుంచి, 50 శాతానికి రిజర్వేషన్ లు తగ్గించటంతో, గతంలో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్, ఇప్పుడు 24 శాతం అయ్యింది. అయితే, బీసీలు ఇంతలా నష్టపోతుంటే, జగన్ మోహన్ రెడ్డి, ఎందుకు కోర్ట్ కు వెళ్ళటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. దీని పై టిడిపి కూడా మండి పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 24 శాతానికి తగ్గించి వెనుకబడిన కులాలకు జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక ద్రోహం చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ చర్యను బీసీలు, బీసీ సంఘాలు వ్యతిరేకించాలన్నారు. బీసీ వర్గాలకు చెందిన 15 వేల మందికి రాజకీయ అవకాశాలు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో బీసీ నాయకత్వాన్ని అణగదొక్కేందుకు.. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసే కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 శాతం రిజర్వేషన్ సాధించగా ఇప్పుడు జగన్ ఎందుకు ఆ పని చేయటం లేదని ప్రశ్నించారు.