ప్రపంచవ్యాప్తంగా కరోనాధాటికి దేశాలన్నీ కకావికలమవుతుంటే, జగన్మోహన్ రెడ్డి, మంత్రు లు, ప్రభుత్వ సలహాదారులు టీడీపీపై, చంద్రబాబుపై బురదజల్లుతూ, రాజకీయాల చుట్టూ తిరుగుతూ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని టీడీపీనేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణతీరు, ప్రభుత్వ వైఖరి, తనకు జరిగిన అవమానంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ ఈసీ) కేంద్ర హోంశాఖకు లేఖరాస్తే, దానిపై కూడా ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్మాదంతో రాద్ధాంతం చేశారని నిమ్మల దుయ్యబట్టారు. డీజీపీని అడ్డుపెట్టుకొని, లేఖలోని వివరాలు బయటకు రాకుండా చేయడంకోసం మీడియాను బెదిరిస్తూ, వైసీపీవారు ఇష్టానుసారంగా ప్రవర్తించా రన్నారు. లేఖ ఎస్ ఈసీ ఏ రాశాడని కేంద్ర హోంశాఖ నిర్ధారించిందని, దానికి సంబంధించి కేంద్ర హోంశాఖ స్పష్టమైన ప్రకటనకూడా చేసిందన్నారు. సదరులేఖ ఎస్ ఈసీ రాయలేద ని, ఆయనతో టీడీపీఏ రాయించిందని, ఎన్నికల కమిషనర్ సంతకాన్ని టీడీపీవారే ఫోర్జరీ చేశారని, పలురకాలుగా దుష్ప్పచారం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీనేతలు ఇప్పుడు తమతలకాయలు ఎక్కడ పెట్టుకుంటారని నిమ్మల నిలదీశారు. ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, హింసాత్మక ఘటనలతో పాటు బెదిరింపుల, ప్రలోభాలతో కూడిన బలవంతపు ఏకగ్రీవాలను కూడా ఈసీ తనలేఖలో ప్రస్తావించాడన్నారు. ఈసీ లేఖ, అందులో పేర్కొన్న అంశాలపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని, టీడీపీవారిపై, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై స్పందించకుండా ప్రజలను మభ్యపెట్టాలని చూసిన జగన్, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని రామానాయుడు ప్రశ్నించారు.

కడపజిల్లాలో 553 ఎంపీటీసీలుంటే, 439స్థానాలు, 50జడ్పీటీసీలకు 38స్థానాలు ఏకగ్రీవమైన విషయాన్ని కూడా ఈసీ తన లేఖలో చెప్పడం జరిగిందన్నారు. ఒక్కరుకూడా ఓటువేయకుండా, ఎన్నికలు జరగకుం డానే, బలవంతపు ఏకగ్రీవాలు జరిగినవైనాన్ని, ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అపహాస్యమైన తీరుని కమిషనర్ తనలేఖలో ప్రస్తావించాడన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అప్రతిష్టపాలు కావడానికి, ఎన్నికల్లో ఘోరాలు జరగడానికి, ముఖ్యమంత్రి చేసిన ప్రకటే కారణమని, స్థానికఎన్నికల్లో 90శాతం గెలిచితీరాలంటూ ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను బెదిరిం చడం వల్లే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఇదే అంశాన్ని ఈసీతనలేఖలో కూడా చెప్పాడని నిమ్మల స్పష్టంచేశారు. తాను ఆదేశించినప్పటికీ, ఎన్నికల్లో ఆకృత్యాలకు పాల్పడిన కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కూడా ఈసీ తనలేఖలో చెప్పడం జరిగిందన్నారు. ఎన్నికలు వాయిదావేశానన్న అక్కసుతో, ముఖ్యమంత్రి తననుకులంపేరుతో దూషించడాన్ని కూడా ఎస్ఈసీ తనలేఖలో ప్రస్తావిం చాడని, ఆయన తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించాడని, సీఎంని ఆదర్శంగా తీసుకొని మంత్రులు, వైసీపీనేతలు, ప్రభుత్వ సలహాదారులు, ఆఖరికి స్పీకర్ కూడా మితిమీరి ప్రవర్తించారని రాజ్యాంగబద్ధమైన పదవిలోఉన్న రమేశ్ కుమార్ లేఖలో వాపోయాడన్నారు.

ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని, నేర స్వభావాన్ని, ఆయన గతచరిత్రను కూడా తన లేఖలో ప్రస్తావించిన ఈసీ, అంతటి ప్రతీకారస్వభావమున్న వ్యక్తి నాయకత్వంలో తాను ఎన్నికలు నిర్వహించలేనని, రాష్ట్రంలో విధులునిర్వర్తించాలంటే తనకు భయంగా ఉందని కూడా ఎస్ ఈసీ వాపోయాడని నిమ్మల తెలిపారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ లో ఉండే విధులు నిర్వర్తిస్తాన ని, ఆంధ్రా పోలీసులపై తనకు నమ్మకంలేదని, కేంద్రబలగాలతో తనకు తగిన రక్షణ కల్పించాలని ఎస్ ఈసీ తన లేఖలో విజ్ఞప్తి చేయడంపై, స్పందించిన కేంద్రహోంశాఖ ఆయనకు భద్రత కల్పించిందన్నారు. కేంద్రహోంశాఖ ప్రకటనపై, ఎస్ ఈసీ తన లేఖలో ప్రస్తావించిన అంశాలపై, ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనతప్పు తెలుసుకొని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. లేఖలో పేర్కొన్న అంశాల్లోని తీవ్రతను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలని, ఎన్నికల నోటిఫికేషన్ రద్దుచేసి, కేంద్రబలగాల ఆధ్వర్యంలో తిరిగి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని నిమ్మల డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ కే రాష్ట్రంలో రక్షణ లేకపోతే, పోటీలో ఉన్న అభ్యర్థుల పరిస్థితి ఏంటన్నారు. స్థానిక ఎన్నికల్లో దాడులతో, కేసులతో, అప్రజాస్వామిక వాతావరణం సృష్టించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు, తన తప్పు తెలుసుకొని జగన్, రాష్ట్రప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసీని కులంపేరుతో దూషించినందుకు, ఆయనకు, కమ్మకులానికి కూడా జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. రాష్ట్రంలో కరోనాప్రభావంలేదని, వైరస్ వలన రాష్ట్రానికి ఏవిధమైన ప్రభావంలేదని, రాబోయే 3-4వారాల్లో కరోనా ప్రభావం ఉండదని, సీ.ఎస్ (చీఫ్ సెక్రటరీ) లేఖ రాసిందని, ఆమెతో అలా రాయించినందుకు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరించినందుకు కూడా ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాక మీడియా ముందుకొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడకుండా, పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో నయమవుతుందని చెప్పడం దారుణమన్నారు.

ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు కూడా ఆయన వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇతరదేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చినవారి విషయంలో ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకుందో ముఖ్యమంత్రి ఇప్పటివరకు వివరించలేదన్నారు. ముఖ్యమంత్రి బాటలోనే ఆయన కార్యదర్శి పీ.వీ.రమేశ్ నడిచాడని, తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఆయన మాట్లాడుతూ, “కరోనా ఒక సాధారణవ్యాధి అని, 80శాతం వరకు ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చని, విశ్రాంతి తీసుకుంటూ, 650 గ్రాముల పారాసిట్మాల్, ప్రతి 6గంటలకు ఒకసారి తీసుకుంటే, పూర్తిగా నయమవుతుంది” అని చెప్పడం జరిగిందన్నారు. (రమేశ్ మాట్లాడిన వీడియోను ఈసందర్భంగా విలేకరులకు ప్రదర్శిం చారు) పీ.వీ.రమేశ్ చెప్పిన మోతాదుప్రకారం ప్రతిఆరుగంటలకు 650గ్రాముల చొప్పున తీసుకుంటే, ఒక్కోవ్యక్తి, ఒక్కరోజులో రెండున్నరకిలోల పారాసిట్మాల్ తీసుకోవాల్సి ఉంటుం దని, ఆస్థాయిలో తీసుకుంటే, మనిషనేవాడు బతుకుతాడా అని నిమ్మల ప్రశ్నించారు. రోజుకి రెండున్నర కిలోల పారాసిట్మాల్ వేసుకోమని ముఖ్యమంత్రి కార్యదర్శి చెప్పడం చూస్తుంటే, కరోనాపై రాష్ట్రముఖ్యమంత్రికి ఎంత సీరియస్ నెస్ ఉందో, ఆ కార్యదర్శికి కూడా అంతే సీరియస్ నెస్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా మాట్లాడటానికి వారికి సిగ్గు, లజ్జ, బుధ్ధి, జ్ఞానం ఉన్నాయా అని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరకంగా కరోనావిషయంలో కూడా ముఖ్యమంత్రి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని, అందుకు కూడా ఆయన ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఎస్ఈసీ రాసిన లేఖ తప్పుడుదని, ఆయన సంతకం ఫోర్జరీ చేశారని, టీడీపీవారే రాయించారని వైసీపీప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు దుష్ప్రచారం చేశారని, సదరు లేఖపై కేంద్రహోంశాఖ చేసిన స్పష్టమైన ప్రకటన తరువాత వారేం సమాధానం చెబుతారని రామానాయుడు నిలదీశారు. (కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు), రాష్ట్రఎన్నికల కమిషనర్ లేఖ తమకు అందిం దని, దానిపై స్పందించి, ఆయనకు భద్రతకల్పించామని, లేఖలో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ ని ఆదేశించినట్లు కిషన్ రెడ్డిచెప్పాడని, దానిపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏం సమాధానం చెబుతారని టీడీపీనేత ప్రశ్నించారు. ఈ విధంగా నీచాతినీచంగా విషప్రచారం చేసినందుకు సిగ్గు, ఎగ్గు, మానం, అభిమానం అనేవి ముఖ్యమంత్రికి ఏమైనా ఉంటే, ఆయన తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబుకి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లింకుపెట్టి నోటికొచ్చినట్లు బుధ్దిలేకుండా మాట్లాడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు తమతలలు ఎక్కడ పెట్టుకుంటారన్నారు.

ఎన్నికల్లో అప్రజాస్వామికచర్యలకు పాల్పడినందుకు, బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడినందుకు, ఎస్ఈసీకి కులాన్ని ఆపాదించి దూషించినందుకు, కరోనాప్రభావం లేదని చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టించినందుకు ముఖ్యమంత్రి రాష్ర్టప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని నిమ్మల తేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి నేరస్వభావం, ఫ్యాక్షన్ మనస్తత్వం కారణంగా భయభ్రాంతులకు గురైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన విధులను హైదరాబాద్ నుంచే నిర్వహిస్తున్నాడని, దాన్ని బట్టే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలంతా గ్రహించాలన్నారు. బీహర్ వంటి రాష్ట్రంలో ఉండే హింసాయుతమైన వాతావరణం రాష్ట్రంలో సృష్టించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలోని అంశాలన్నీ వాస్తవాలైనందున, కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా ప్రభావం తగ్గాక, ఎన్నికలకు సంబంధించి రీనోటిఫికేషన్ఇచ్చి, ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలుజరిపించాలని నిమ్మల పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశారు. అలా జరిగితేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందన్నారు. ప్రజలను కరోనా బారి నుంచి కాపాడేలా ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించాలని నిమ్మల కోరుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read