రాష్ట్రంలో ఇప్పటివరకూ ఐదుగురికి కరోనా పాజిటివ్​గా వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్​ విడుదల చేసింది. ఇప్పటికే 11,640 మందికి స్క్రీనింగ్​ పూర్తయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విదేశీయులను అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. మరోవైపు వైరస్​ వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. కరోనా విస్తృతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్‌ ధ్రువీకరణ అయింది. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైంది. విశాఖ విమానాశ్రయం, ఓడరేవు వచ్చిన 11,640 మందికి స్క్రీనింగ్ పూర్తయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులకు అధికారులు క్షుణ్ణంగా పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రానికి 12,953 మంది విదేశీ ప్రయాణికులు వచ్చినట్టు గుర్తించారు.

2,052 మంది ప్రయాణికులను క్వారంటైన్‌లో 28 రోజుల పరిశీలన చేస్తున్నారు. మరో 10, 841 మందిని హోం ఐసోలేషన్ విధానంలో పరీక్షిస్తున్నారు. ఇప్పటికే.. 60 మందిని ఆస్పత్రిలో చేర్పించారు. వీరందరిలో 160 మంది అనుమానితుల నమూనాలను పరీక్షలకు పంపారు. అందులో.. 130 మందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మిగిలినవారి నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈరోజు మరో కేసు నిర్ధారణ జరిగింది. ఇవాళ్టితో కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 22కు చేరింది. ఏపీలోని గుంటూరుకు చెందిన 22 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అతను ఇటీవలే లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చినట్లు తెలిపింది.

ఆ వ్యక్తిని ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అటు దేశంలో కరోనా కేసుల సంఖ్య 341కి చేరింది. ఈ వైరస్ సోకి మృతి చెందిన వారి సంఖ్య 6కు పెరిగింది. కరోనా వ్యాప్తి నివారణకు జనతా కర్ఫ్యూ పాటించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయవాడలో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. కర్ఫ్యూతో విజయవాడలోని రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ రోడ్డు వెలవెలబోతుంది. చెన్నై - విజయవాడ జాతీయ రహదారిపై అత్యవసర వాహనాలు మినహా, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరం మినహా మిగిలిన సేవలు అన్నీ బందయ్యాయి.  

Advertisements

Advertisements

Latest Articles

Most Read