రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య దూరం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని అధికారపక్షం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషను పనిచేసిన మాజీల అభిప్రాయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను గవర్నర్‌ను కలిశారు. వీరిలో సీఎస్ నీలం సాహ్ని, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఎస్ఈసీ అంశంపై వారు గవర్నర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా వారు గవర్నరుకు వివరించారు. ముఖ్యంగా ఎస్ఈసీ రాసిన లేఖలోని పలు అంశాలను వారు గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉండి కార్యకలాపాలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయిచండాన్ని అధికార వైసీపీ తీవ్ర పరిణామంగా తీసుకుంటోంది.

అందుకే ఎస్ఈసీ వివాదానికి తెరవేయాలని ఖరాఖండిగా నిర్ణయించింది. ఇందుకోసం రెండుమూడు వ్యూహాలనుసిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిగా ఎస్ఈసీని విధుల నుండి తప్పించేందుకు ఎలా వెళ్లాలనే అంశం పై దృష్టిపెడుతోంది. ఈ నెల 28 నుండి 31 వరకూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాల్లోనే ఎఈసీని బాధ్యతలనుండి తొలగించేలా తీర్మానం చేసి దానిని కేంద్రానికి పంపాలని యోచన చేస్తోంది. అయితే, రాష్ట్రం పంపిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తుందా..లేదా..అన్నదానిపై సంశయం నెలకొన్న నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన కార్యక్రమాలపై కూడా దృష్టిపెడుతోంది. ఇందులో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన లేఖ ఎక్కడి నుండి వచ్చిందో సాంకేతికంగా తెలుసుకునేందుకు అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ తరపున డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదుచేసి వాస్తవాలను బయటపెట్టాలని కోరింది.

ఇక దీంతో పాటు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ప్రభుత్వం తరపున ఏఏ నిర్ణయాలు తీసుకుంటే ఈ వివాదాన్ని కట్టడి చేయవచ్చనే అంశంపై కూడా దృష్టిపెట్టారు. ఇదే అంశంపై అధికారపక్షం మరోమారు కోర్టును ఆశ్రయించడమా లేక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే మరో అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోను ముగ్గురు కమిషనర్లను నియమించాలని భావిస్తున్నారు. వెంటనే ఆర్డినెన్స్‌ తెచ్చి, మరో ఇద్దరు కమిషనర్లను, తమకు అనుకూలమైన వారిని నియమించాలని, తద్వారా రమేష్ కుమార్ కు బ్రేక్ వెయ్యచ్చు అని భావిస్తున్నారు. అయితే ఇవన్నీ అయ్యే పనులు కాదని, హైకోర్టు న్యాయమూర్తి హోదా ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను అభిశంసన ద్వారా తప్ప, వేరే విధంగా తప్పించే అవకాశమే లేదని అంటున్నారు. ఇవన్నీ జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read