దేశ వ్యాప్తంగా, కరోనా ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్న కేంద్రం, ఆ జాబితాలో మన రాష్ట్రానికి చెందిన విశాఖపట్నంను చేర్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా, 29 హాట్ స్పాట్లను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రోజు రోజుకీ ఈ వైరస్ పెరుగుతూ ఉండటం, పోజిటివ్ కేసులు వేగంగా పెరుగుతూ ఉండటంతో, ఈ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను ఈ రోజు గుర్తించింది. ఈ కొత్త జాబితాలో, కరోనా హాట్ స్పాట్ గా, విశాఖపట్నం చేరింది. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశాఖను హాట్ స్పాట్ జాబితాలో చేర్చిన విషయాన్ని, ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ తెలిపినట్టు, కధనం వచ్చింది. ఈ రోజు ఇచ్చిన జాబితాలో, విశాఖతో పాటుగా బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఢిల్లీలోని న్యూఢిల్లీ, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ కూడా కొత్తగా కరోనా హాట్ స్పాట్ లు గా చేరాయి. మరో పక్క, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా, వైజాగ్ లో ని కొన్ని చోట్ల, రెడ్ జోన్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. వైద్య నిపుణులను 24 గంటలు అందుబాటులో ఉంచే పని ఒకవైపు... మరో వైపు లాక్ డౌన్ అమలు వల్ల ఎక్కడా నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. క్వారంటైన్, ఐసొలేషన్ వార్డుల ఏర్పాటులో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఎప్పటికప్పుడు అనుమానితులను పరిశీలిస్తున్నాయి. కరోనా తాజాగా నిర్ధారణ అయిన మూడు కేసులు తాటిచెట్లపాలెంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇది ఇలా ఉంటే, విశాఖపట్నం రెండో సర్కిల్ పరిధిలోని కొన్ని పౌర సరఫరా డిపోల్లో కందిపప్పు లేదని డీలర్లు చేతులెత్తేయడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ నుంచి కందిపప్పు సరఫరాలో ఆలస్యం జరిగిందని.. సోమవారం నాటికి అన్ని డిపోల్లోనూ సరఫరా చేస్తామని పౌర సరఫరాల సహాయ సరఫరా అధికారి ఎమ్.వి.ప్రసాద్ తెలిపారు.

మరో పక్క, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో 26 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. శనివారం ఉదయం 10 గంటల వరకు 180 కేసుల నమోదవగా అప్పటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో 10 పాజిటివ్​ కేసులను నిర్ధరించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 190కి చేరింది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో, 15 పోజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో, కూడా 15 పోజిటివ్ కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో 19 పోజిటివ్ కేసులు వచ్చాయి. కడపలో 23 పోజిటివ్ కేసులు, గుంటూరులో 26 పాజిటివ్ కేసులు వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read