రైతు బజార్ల వద్ద నిబంధనలు అమలుకావడం లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అసహనం వ్యక్తం చేశారు. లాక్డౌన్ లక్ష్యం నెరవేరడం లేదని ప్రభుత్వం అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. రైతు బజార్లకు ప్రజలు ఒకేసారి వస్తున్నారని, అందుకే వాటిని వికేంద్రీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఖాళీ ప్రదేశాల్లో ఇళ్లకు 3 కిలోమీటర్లలోపు రైతు బజార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యావసర షాపులు ఉదయం 6 నుంచి 1 గంట వరకే తెరిచి ఉంచాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఎక్కువ సమయం తెరిచి ఉంచడం వల్ల ప్రజలు గుమిగూడకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
నిత్యావసర ధరలు పెరగడం, బ్లాక్ మార్కెటింగ్ నివారణకు 1902 టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక వాహనంపై ఒకరు మాత్రమే వెళ్లాలని, నిత్యావసర సరకుల రవాణాకు అవసరమైన హమాలీలకు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని ఇబ్బందులున్నా నిబంధనలను పాటించాలని మంత్రి కోరారు.