విశాఖలో చంద్రబాబుని అడ్డుకునే క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు సాగించిన దౌర్జన్యకాండ చూశాక, జగన్ దాష్టీకంపై, దుర్మార్గపు పాలనపై మరోసారి సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుమారం రేగిందని, జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి విమానం ఎక్కించి పంపించింది చంద్రబాబుని కాదని, కొన్ని లక్షలకోట్ల పెట్టుబడులను అంటూ ఒక పోస్ట్ విపరీతంగా చెలామణి అవుతోందని టీడీపీనేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వివరించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ పోస్ట్ నూటికినూరుశాతం వాస్తవమని, జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు, ఎన్ని లక్షలకోట్ల పెట్టుబడులు పక్కరాష్ట్రాలకు తరలిపోయాయో ప్రజలంతా చూశారన్నారు. లులూ గ్రూప్, ఆదానీ గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి పరిశ్రమలను తరిమేసి, లక్షలకోట్ల పెట్టుబడులను ఇప్పటికే తరిమేశారని, చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని దమనకాండ సాగించడంద్వారా, భవిష్యత్ లో కూడా పారిశ్రామికవేత్తలెవ రూ రాష్ట్రంవైపుచూడకుండా జగన్ ప్రభుత్వం విధ్వంసకాండ సృష్టించిందన్నారు.

విశాఖ నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 7వేల ఎకరాల భూముల్ని ఇప్పటికే వివిధకారణాలతో కాజేశారని, పేదవాడి భూమిని లాక్కుంటున్న నేపథ్యంలోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చారన్నారు. ఆయనను అడ్డుకునే క్రమంలో జగన్ అండ్ కో సాగించిన వికృతక్రీడతో విశాఖ నగరం శాశ్వతంగా పెట్టుబడులకు దూరమైపోయిందని, పారిశ్రామికవేత్తలెవరూ నగర పొలిమేరల్లోకి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. జగన్ సర్కారు విశాఖలో ఒకవైపు యుద్ధకాండ సాగిస్తుంటే, ప్రావిడెంట్ గ్రూప్ వారు తెలంగాణలో తమ ఆవిష్కరణ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి, కేటీఆర్ తో చర్చలు జరిపిందన్నారు. ఆంధ్రాలో రోడ్లపై వైసీపీమూకలు దమనకాండ సాగిస్తుంటే, తెలంగాణలో అమెరికా సంస్థ రూ.700కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందన్నారు. రాష్ట్రం నుంచి పెట్టబడులు తరిమివేస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని పట్టాభి ప్రశ్నించారు. జగన్ గొప్పతనం గురించి కేంద్రమంత్రి పీయూష్ గోయెల్, కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సదస్సులో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం పీపీఏలపై నిర్వహించిన సమీక్షలవల్ల, దేశమే తీవ్రంగా నష్టపోయిందని, భారతదేశ ప్రతిష్ట తీవ్రంగా దిగజారిపోయిందని, దేశంలోకూడా పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురాని దుస్థితి ఏర్పడిందని చెప్పడం జరిగింద న్నారు.

ఇండియా సక్సెస్ స్టోరీని జగన్ లాంటి వారు కిల్ చేస్తున్నారని కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. అదే కేంద్రమంత్రి దావోస్ వెళ్లినప్పుడు కూడా ఏపీ ముఖ్యమంత్రి తీరుపై పారిశ్రామికవేత్తలంతా ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. . 2018 జనవరిలో యూఎస్ టీడీఏ (యునైటెడ్ స్టేట్స్ ట్రేడింగ్ డెవలప్ మెంట్ ఏజెన్సీ) తో విశాఖ అభివృద్ధికి సంబంధించి, చంద్రబాబునాయుడు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందని, దేశంలోనే విశాఖ నగరాన్ని అత్యుత్తమ నగరంగా మార్చడమే ఆనాటి ఒప్పందంలోని ముఖ్య ఉద్దేశమన్నారు. నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉండిఉంటే, తెలంగాణకు తరలిపోయిన రూ.700కోట్ల ప్రావిడెంట్స్ సంస్థ పెట్టుబడులు, ఏపీకే వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు చేసుకున్నఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసి ఉంటే, విశాఖ నగరం అంతర్జాతీయస్థాయిలో పేరుప్రఖ్యాతులు పొంది ఉండేదన్నారు. జగన్ నిర్వాకాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ వాసులు ఎక్కడికి వెళ్లినా, మేం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు తమది ఏపీ అని చెప్పుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని, జగన్ రాష్ట్రానికి ఎంతటి తలవంపులు తీసుకొచ్చాడో ఆయన చర్యలతోనే స్పష్టమవుతోందన్నారు. జగన్ అవినీతి చర్యలపై ఇప్పటికే జర్మనీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాలు ప్రధానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగిందన్నారు.

జగన్ నిర్వాకాలు, అవినీతి చర్యల కారణంగా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోతలు విధించాలని, కేంద్రప్రభుత్వ చేసుకున్న ఒప్పందాలు, విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించే రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులురాకుండా చేయాలని కూడా పీయూష్ గోయెల్ వ్యాఖ్యానించడం జరిగిందన్నారు. దీనిపై ఒకచట్టం చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. జగన్ చర్యల కారణంగా భవిష్యత్ లో రాష్ట్రానికి ఏవిధమైన నిధులు వచ్చే అవకాశం లేకుండా పోయిందని, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలని పట్టాభి నిలదీశారు. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పట్టాభి తేల్చిచెప్పారు. 5ఏళ్ల కొకసారి ఎటుపడితే అటు దొర్లుకుంటూ పార్టీల్లోకి వెళ్లే బంతిలాంటి అవంతికి, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని, ఆ బంతిని ఎప్పుడు బూటుకాళ్లతో బంగాళాఖాతంలోకి తందామా అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారని పట్టాభి దెప్పిపొడిచారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read