కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల సగం జీతం మాత్రమే చెల్లించనుంది ప్రభుత్వం. మిగిలిన సగం నిదులు సర్దుబాటు అయ్యాక చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలపైనా ప్రభావం చూపింది. మార్చి నెల జీతాన్ని రెండు విడతల్లో చెల్లించే ప్రతిపాదనలు చేసింది. ఏప్రిల్ 1న ఉద్యోగులకు చెల్లించే జీతాలను రెండు విడతల్లో చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు.... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఉద్యోగుల సంఘం అంగీకరించిందని తెలిపారు.
ఇక మరో పక్క, కరోనా వ్యాధి తీవ్రత పెరుగుతుంటే ప్రజలను రేషన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టడం తగదంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. నాలుగున్నర లక్షల మంది గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుంటూ నిత్యావసరాలను ఇళ్లకు పంపిణీ చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటం సహా అక్రమ మద్యం నివారణ, వివిధ వర్గాలకు ఆర్థికసాయం వంటి అంశాలపై నాలుగు పేజీల లేఖ రాశారు. లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాలు ఆర్థికంగా చితికిపోతున్నందున ప్రతి కుటుంబానికి తక్షణమే ఐదు వేల రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు, నష్టపోతున్న ఉద్యానపంటలు, ఆక్వా, పౌల్ట్రీ రంగాలను ఆదుకోవాలని కోరారు.
రాష్ట్రంలో అనధికార మద్యం విక్రయాలు కలవరపెడుతున్నాయని, వాటిని తక్షణమే నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా నిర్వహిస్తోందన్న చంద్రబాబు, కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈనెల 17వ తేదీన నిజాముద్దీన్ నుంచి దాదాపు 700మంది రాష్ట్రానికి వచ్చినందున, వారందరికీ తక్షణమే పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.