టీడీపీ తరుపున నామినేషన్లు వేయనీయకుండా అడుగడుగునా ప్రభుత్వం అడ్డుకుంటోందని, రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 559 చోట్ల తెలుగుదేశం వారిని నామినేషన్లు వేయనీయకుండా వైసీపీవారు దౌర్జన్యం చేశారని, 13 చోట్ల జడ్పీటీసీలకు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సహచర ఎమ్మెల్సీలు అశోక్ బాబు, సత్యనారాయణ రాజు, రామకృష్ణలతో కలిసి, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థానికపోరులో గెలవడం కోసం వైసీపీ ప్రభుత్వం చేయాల్సిన దారుణాలన్నీ చేస్తోందని, వ్యవస్థలను కుప్పకూలుస్తూ ప్రతిపక్ష పార్టీవారిపై దౌర్జన్యాలకు దిగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయన్నఫిర్యాదుల జాబితా తమ వద్ద ఉందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారులను, పోలీసులను నేరాలు, తప్పుడు పనుల్లో భాగస్వాములను చేస్తోందని, వారిసాయంతో నామినేషన్లు వేయకుండా ప్రతిపక్ష సభ్యులను అడ్డుకుంటోందన్నారు. మేం చెప్పేవాటిని వైసీపీవారు పదేపదే తప్పు అంటుంటారని, అలా చెప్పడానికి వారివద్ద ఏవిధమైన ఆధారాలు ఉండవని, కానీ తమపార్టీ వారికి జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రప్రజలు ఇప్పటికైనా మేలుకోకుంటే రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉందన్నారు. నియంతను అడ్డుకోవడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. ఏమన్నా చేయండి.. 90శాతం స్థానాలు వైసీపీ గెలిచితీరాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.
అనేక దుర్మార్గాలు, సిగ్గుమాలిన చర్యలకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయన్న దీపక్ రెడ్డి, వాటన్నింటిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పంపుతున్నామని, ఆయనకు ఏమాత్రం చిత్తుశుధ్ది ఉన్నా, ఈ దురాగతాలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దీపక్ డిమాండ్ చేశారు. కార్వేటి మండలం ఎస్సై, సీఐ, చిత్తూరుజిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు ఫోన్ చేశామో, ఆ కాల్ లిస్టంతా ఈసీకి అందచేస్తామని, ఆయనేం చర్యలు తీసుకుంటాడో చూస్తామన్నారు. ఎన్నికల కమిషనర్ వెంటనే అధికారులపై చర్యలు తీసుకోలేకపోతే, ఆయన తక్షణమే ఎన్నికలను నిలిపివేయాలన్నారు. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలను జోకర్లలా, బఫూన్లలా భావించకుండా, ప్రజలంటే లెక్కలేనితనంతో వ్యవహరించకుండా, వారికోసమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న విషయాన్ని ఈసీ గుర్తించాలన్నారు. పోలీస్ శాఖలో ఉన్న చీడపురుగులను ఎన్నికల సంఘం ఏరివేయకుంటే వాటివల్ల వ్యవస్థలకు జరిగే నష్టం చాలా తీవ్రస్థాయిలో ఉంటుందని దీపక్ రెడ్డి స్పష్టంచేశారు. తనవద్ద ఉన్న ఆధారాలను (వీడియోలు, ఆడియోలు, ఫొటోలు) ఎన్నికల కమిషన్ ముందుంచుతామని, వాటిని ఆధారంగా చేసుకొని ఏంచర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే తమపార్టీ తరుపున హైకోర్టుని ఆశ్రయిస్తామన్నారు. ఈగడ్డపై పుట్టిన వ్యక్తిగా ఇక్కడ జరిగే దారుణాలు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తాను చూడలేకపోతున్నానని చెప్పిన దీపక్ రెడ్డి, ప్రజలంతా ఇప్పటికైనా మేల్కొని, ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని విజ్జప్తి చేశారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే స్వయంగా దౌర్జన్యాలు, దోపిడీలకు దిగి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలోకి దిగకూడదన్న కక్షతో, పోలీసులు, అధికారుల సాయంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన భయాందోళనలు రేకిత్తించిందని ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ తెలిపారు. టీడీపీతరుపున దాదాపు 90శాతం మంది వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు వేయడం చూస్తుంటే, చాలావరకు ప్రతిపక్షం విజయం సాధించినట్టేనన్నారు. ఎన్నికల్లో ఓడిపోతానన్న విపరీతమైన భయం, ఒత్తిడికారణంగానే జగన్ 90శాతం గెలిచితీరాలని ప్రకటన చేశాడన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మంత్రులు జీరోలు కాదు హీరోలని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం మంత్రులంతా జీరోలుగానే మిగిలిపోయారని రామకృష్ణ ఎద్దేవాచేశారు. పాలనావ్యహారాల్లో ఏం జరుగుతుందో కూడా మంత్రలుకు తెలియడంలేదని, రాష్ట్రంలో నియంతపాలనే నడుస్తోందన్నారు. జగన్ పరిపాలనలో అరాచకపాలనకు మారుపేరైన బీహార్ ని వెనక్కు నెట్టి, ఏపీ ముందుస్థానంలో నిలిచిందన్నారు. తామేం చేసినా చెల్లుతుంది, తమను అడిగేవారు లేరన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మంచివాడుకూడా చెడ్డవాడిలా మారే నీచమైన సంస్కృతిని వైసీపీప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇటువంటి చర్యలను తుంచివేయకపోతే, రాష్ట్రం సర్వనాశనమవుతుందన్నారు. టీడీపీతరుపున చాలా ప్రాంతాల్లో బీసీలు, దళితులు, మైనారిటీలే అధికంగా ఎన్నికల్లో నిలిచారని, వారిని అడ్డుకోవడం ద్వారా జగన్ ప్రభుత్వం ఆయావర్గాల వ్యతిరేకిగా నిలిచిందన్నారు.