నీ మొఖం చూసి, ఎవరు పెట్టుబడులు పెడతారు చంద్రబాబు ? నువ్వు విదేశాలకు వెళ్ళింది, పెట్టుబడులు కోసం కాదు, విలాసాలకు... ఇవి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై, అప్పటి ప్రతిపక్ష నేత, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు రూపాయి పెట్టుబడికు కూడా 5 ఏళ్ళ పాలనలో తీసుకు రాలేదని జగన్ ఊరు ఊరు తిరుగుతూ చెప్పారు. చంద్రబాబు హయంలో, ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ప్రచారం చేసే వాళ్ళు. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ చంద్రబాబు ప్రచారం చేసారు కాని, చంద్రబాబు ఒక్క పెట్టుబడి కూడా తేలేదు అంటూ అప్పట్లో వైసీపీ ఊదరగొట్టేది. మేము అధికారంలోకి వస్తే, కంపెనీలే కంపెనీలు, పెట్టుబడులే పెట్టుబడులు, ఉద్యోగాల విప్లవం తెస్తాం, ప్రత్యెక హోదా మెడలు వంచి తీసుకువస్తాం, ఇన్కమ్ టాక్స్ కట్టాల్సిన పని ఉండదు, అంటూ, ఇలా అప్పట్లో అనేక ప్రచారాలు చేసేది వైసీపీ. అయితే చంద్రబాబు కాని, తెలుగుదేశం కాని, ఈ ప్రచారాన్ని లైట్ తీసుకోవటంతో, ప్రజలు కూడా ఇది నమ్మే పరిస్థితి వచ్చింది.
అనంతపురంలో కియా లాంటి కంపెనీ, దేశంలోనే, అతి పెద్ద విదేశీ పెట్టుబడి. చంద్రబాబు ఈ కంపెనీ కోసం, ఎంత కష్టపడ్దరో అందరికీ తెలుసు. అయితే, ఈ కంపెనీ కోసం, 2007లోనే రాజశేఖర్ రెడ్డి ఉత్తరం రాసారు అంటూ, బుగ్గన అసెంబ్లీలో చెప్పారు అనుకోండి, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు ఒక్క ఉద్యోగం తేలేదు, ఒక్క కంపెనీ తేలేదు, ఒక్క రూపాయి పెట్టుబడి లేదు, ఒక్క ఉద్యోగం రాలేదు అంటూ, ఊదరగొట్టారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మొత్తం మారిపోయింది. ఉన్న కంపెనీలు కూడా వెనక్కు పోతున్నాయి. చంద్రబాబు తెచ్చిన కంపెనీలే గతి అయ్యింది. ఈ సందర్భంలో, జగన్ పార్టీలో నెంబర్ 2 అయిన, విజయసాయి రెడ్డి, పార్లిమెంట్ కు ఇచ్చిన ఒక నివేదిక ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది.
విజయసాయి రెడ్డి, పార్లమెంట్ లో, కామర్స్ స్టాండింగ్ కమిటీకి, అధ్యక్షుడుగా ఉన్నారు. 2016-19 మధ్య దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులు పై ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ లో, చంద్రబాబు హయంలో, 2016-19 మధ్య 6,897.97 మిలియన్ అమెరికన్ డాలర్ల, అంటే, దాదాపుగా 50 వేల కోట్లు విదేశీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి అంటూ, సాక్షాత్తు విజయసాయి రెడ్డి, సంతకం పెట్టి మరీ చెప్పారు. దేశంలోనే విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవటంలో, 2016-19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆరోస్థానంలో ఉందని ఆయన రిపోర్ట్ లో రాసారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డే సంతకం పెట్టి మరీ, చంద్రబాబు హయంలో, కేవలం విదేశీ పెట్టుబడులే, 50 వేల కోట్లు వచ్చాయి అని చెప్పారు అంటే, మొన్నటి దాక వారు చేసిన ప్రచారం అబద్ధం అని, వారే చెప్పినట్టు అయ్యింది. పార్లమెంట్ కు ఆన్నీ నిజాలే చెప్పాలి, సాక్షి లెక్కలు చెప్తే తంతారు కాబట్టి, నిజాలు చెప్పారు అంటూ, టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.