స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. ఈనెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. ఈనెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న తొలివిడత నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 9న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. 14న నామినేషన్ల పరిశీలన.. 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామాల విషయంలో, ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించ వద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆపేయాలని ఆ లేఖలో ప్రభుత్వం కోరింది.
హైకోర్టులో ఈ గ్రామాల విషయంలో కేసులు, వ్యాజ్యాలు ఉన్నందున వాటి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అమరావతి ఉద్యమం నేపథ్యంలో, ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలోనే ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసినట్టు అర్ధం అవుతుంది. ఇక్కడ ప్రజలు గత 82 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కనుక ఎన్నికలు పెట్టి, ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కనిపిస్తే, ప్రభుత్వం పరువు పోతుంది అని, జగన్ ప్రభుత్వం భయంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రజలను పలకరించే ధైర్యం కూడా వైసీపీ చేయలేక పోతుంది. ఈ నేపధ్యంలోనే, ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేం అని తెలియటంతో, ఎన్నికల కమిషన్ కు ఇక్కడ ఎన్నికలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.